V6 News

భర్తను హనీమూన్ తీసుకెళ్లి చంపిన భార్య సోనమ్‎కు బెయిల్

భర్తను హనీమూన్ తీసుకెళ్లి చంపిన భార్య సోనమ్‎కు బెయిల్

షిల్లాంగ్: దేశంలో సంచలనం సృష్టించిన రాజా రఘువంశీ హనీమూన్ మర్డర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలు, రాజా రఘువంశీ భార్య సోనమ్ రఘువంశీకి షిల్లాంగ్‌ న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. షిల్లాంగ్ విడిచి వెళ్లకూడదని, ప్రతిరోజూ స్థానిక పోలీస్ స్టేషన్‌కు హాజరై సంతకం చేయాలని చేసుకోవాలని కోర్టు ఆదేశించింది.

అసలు కేసు ఏంటంటే..?

మధ్యప్రదేశ్‎లోని ఇండోర్‎కు చెందిన బిజినెస్‎మెన్ రాజా రఘువంశీకి అదే సిటీకి చెందిన వ్యాపా దేవీసింగ్ రఘువంశీ కుమార్తె సోనమ్ 2025, మే 11న వివాహం జరిగింది. మే 20న రఘువంశీ, సోనమ్ మేఘాలయాకు హనీమూన్ వెళ్లారు. 22న స్కూటర్ రెంట్‎కు తీసుకుని మౌలఖియాట్ అనే ప్రాంతానికి చేరుకున్నారు. ఇక ఆ తర్వాత నుంచి రఘు వంశీ కనిపించకుండాపోయారు. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కొత్త జంట జాడ కనిపెట్టేందుకు మేఘాలయా ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) ఏర్పాటు చేసింది.

 జూన్ 2న ఓ జలపాతం దగ్గర లోయలో రాజా రఘువంశీ డెడ్ బాడీ దొరికింది. అతని గోల్డ్ రింగ్, చైన్ మిస్ అయినట్టు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత స్పాట్ కు దగ్గర్లోనే రక్తపు మరకలు ఉన్న కత్తి, రెయిన్ కోట్ దొరికింది. రఘువంశీ హత్యకు గురైనట్టు భావించిన పోలీసులు.. ఆయన భార్య సోనమ్ కోసం గాలింపు చేపట్టారు. కొన్నిరోజుల తర్వాత ఉత్తరప్రదేశ్ లోని వారణాసి, ఘాజీపూర్ హైవేపై ఆమె ఉన్నట్టు సమాచారం రావడంతో యూపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రియుడు రాజ్ కుష్వాహాతో కలిసి కిరాయి గుండాలతో భర్తను తానే హత్య చేసినట్లు సోనమ్ పోలీసుల విచారణలో ఒప్పుకుంది. షిల్లాంగ్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.