V6 News

గోధ్రాలో అద్భుతం: 100% ముస్లిం ఓటర్లు ఉన్న వార్డులో హిందూ మహిళ గెలుపు..

గోధ్రాలో అద్భుతం: 100% ముస్లిం ఓటర్లు ఉన్న వార్డులో హిందూ మహిళ గెలుపు..

సాధారణంగా మతపరమైన అంశాలతో వార్తల్లో ఉండే గోధ్రా నగరం, 2026 స్థానిక ఎన్నికల్లో ఒక సరికొత్త చరిత్రను సృష్టించింది.  గోధ్రా పట్టణంలోని వార్డ్ నంబర్ 7లో ఓటర్లందరూ ముస్లింలే. అయితే, ఈ వార్డు నుండి అపేక్షాబెన్ నైనేష్‌భాయ్ సోని అనే హిందూ మహిళ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి భారీ విజయం సాధించారు. గోధ్రా మున్సిపాలిటీ చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి.

ఆమె ఆ వార్డులో ఓటరు కాకపోయినప్పటికీ, అక్కడి ప్రజలు ఆమెపై నమ్మకంతో గెలిపించారు. మతం కంటే అభివృద్ధికి, వ్యక్తిగత నమ్మకానికే ముస్లిం ఓటర్లు ప్రాధాన్యత ఇచ్చారని ఈ విజయం నిరూపించింది. దీనిని సామాజిక ఐక్యతకు ఒక గొప్ప ఉదాహరణగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

వార్డ్ 7లోని స్థానిక ప్రజల కష్టసుఖాల్లో తోడుంటారనే నమ్మకంతో అక్కడి వారు మతాలను పక్కన పెట్టి మరీ ఓటేశారు. ఇది కేవలం ఒక గెలుపు మాత్రమే కాదు, కులమతాలకు అతీతంగా వ్యక్తిగత సమర్థతను చూసి ఓటు వేసే కొత్త ట్రెండ్‌కు (గోధ్రా మోడల్) పునాది అని విశ్లేషకులు భావిస్తున్నారు.

ALSO READ : క్రెడిట్ కార్డ్ బిల్లు రూ.12 లక్షలు కట్టాడని పన్ను శాఖ నోటీసులు..

గుజరాత్ ఎన్నికల్లో
ఈ ఎన్నికల్లో గుజరాత్ అంతటా బీజేపీ హవా కొనసాగింది. పట్టణ ప్రాంతాల్లో దాదాపు అన్ని చోట్లా బీజేపీ  పార్టీయే విజయం సాధించింది. మొత్తం 15 మున్సిపల్ కార్పొరేషన్లను బీజేపీ తన ఖాతాలో వేసుకుంది.  ఒక్క అహ్మదాబాద్‌లోనే 192 స్థానాలకు 146 స్థానాలను గెలుచుకోగా, కాంగ్రెస్ కేవలం 18 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు బీజేపీ ధాటికి నిలబడలేకపోయాయి. సూరత్‌లో బీజేపీ 115 స్థానాల్లో విజయం సాధించగా, ఆప్ కేవలం నాలుగు స్థానాలకే పరిమితమైంది.  అయితే, గోధ్రాలో జరిగిన ఈ విభిన్నమైన తీర్పు మాత్రం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.