- నిషేధిత జాబితా నుంచి తొలగించాలని సర్కారు సూత్రప్రాయ నిర్ణయం
- త్వరలోనే మార్గదర్శకాల విడుదలకు సన్నాహాలు
- ఈ జాబితాలో ఉండడంతో ఇన్నాళ్లూ లోన్లు, క్రయ, విక్రయాలు బంద్
- గ్రామకంఠం భూముల్లో కట్టుకున్న ఇండ్లదీ ఇదే పరిస్థితి
- రెవెన్యూశాఖ పొరపాట్లతో పలు పట్టా భూముల్లోని ఇండ్ల యజమానులకూ కష్టాలు
- 20--–30 ఏండ్ల నుంచి ఇంటి పన్నులు కడ్తున్నా హక్కుల్లేవ్
- ప్రజాప్రతినిధులు, కలెక్టర్లకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు
- ప్రభుత్వం స్పందించడంతో ఎట్టకేలకు మోక్షం
- తద్వారా ప్రజలకు హక్కులు.. ప్రభుత్వానికి రెవెన్యూ వస్తుందనే అంచనా
హైదరాబాద్, వెలుగు: అసైన్డ్ భూముల్లోని ఇండ్లు, ఇండ్ల జాగలకు ఎట్టకేలకు మోక్షం లభించనున్నది. 20-, 30 ఏండ్ల కింద ఇండ్లు కట్టుకొని ఇంటి పన్ను, నల్లా పన్నులు కడుతున్నప్పటికీ ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చడంతో క్రయ, విక్రయాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆయా జాగల్లోని ఇండ్లకు, కొత్తగా కట్టే ఇండ్ల నిర్మాణానికి పర్మిషన్లు, లోన్లు కూడా రావడం లేదు. బడుగు, బలహీనవర్గాలకు ప్రభుత్వం స్వయంగా పంపిణీ చేసిన ఇండ్ల జాగాలతోపాటు గ్రామ కంఠం భూముల్లో కట్టిన ఇండ్లు, ఖాళీగా ఉన్న ఇండ్ల స్థలాలను సైతం నిషేధిత ఆస్తుల జాబితా(22ఏ)లో చేర్చడంతో ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. ఎమ్మెల్యేలు కూడా మంత్రులు, సీఎంతో గోడు వెల్లబోసుకుంటున్నారు. దీంతో ఏండ్లుగా ప్రజల ఆధీనంలో ఉండి, పన్నులు కడ్తూ వస్తున్న ఇలాంటి ఇండ్లు, జాగాలన్నింటినీ నిషేధిత జాబితాలోంచి తొలగించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీంతోపాటు 22ఏ జాబితాలో అక్రమంగా చేర్చిన ప్రైవేట్ పట్టా భూముల్లోని ఇండ్లు, నివాస స్థలాలకు కూడా విముక్తి కల్పించనున్నది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో జనవరిలో కొత్తగా రూపొందించిన నిషేధిత జాబితా వల్ల ఏర్పడిన చిక్కుముడులను విప్పేందుకు రెవెన్యూ యంత్రాంగం సమాయత్తమైంది.
అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రంలో 41.94 కోట్ల చదరపు గజాల వ్యవసాయేతర భూములు నిషేధిత జాబితా(22ఏ)లో ఉన్నాయి. ప్రభుత్వం స్వయంగా పేదలకు అసైన్ చేసిన ఇండ్లు, ఇండ్ల స్థలాలు, గ్రామ కంఠ భూముల్లోని ఇండ్లు, జాగలు, ప్రైవేట్ పట్టా పరిధిలోకి వచ్చే నివాసస్థలాలు కూడా ఈ ఆంక్షల పరిధిలోకి వచ్చాయి. 20, 30 ఏండ్ల నుంచి ఇండ్లు కట్టుకొని నివాసం ఉంటున్నప్పటికీ బ్యాంకు రుణాలు అందక, అత్యవసర సమయాల్లో వాటిని అమ్ముకోలేక యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక రకంగా ఆ ఆస్తులు ఉన్నా లేనట్లే లెక్క. క్రయ, విక్రయాలు లేకపోవడం వల్ల రిజిస్ట్రేషన్లు నిలిచి, సర్కారుకు ఆదాయం కూడా రావడం లేదు.
ఈ నేపథ్యంలో ఆయా నివాస స్థలాలకు వెంటనే విముక్తి కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బాధితుల నుంచి వచ్చిన పిటిషన్ల ఆధారంగా క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించి కలెక్టర్ల ద్వారా నివేదికలు తెప్పించుకోనున్నది. ప్రైవేట్ఇండ్లు, భూముల విషయంలో రెవెన్యూ రికార్డుల నమోదు సమయంలో దొర్లిన పొరపాట్లు, సాంకేతిక లోపాలే ఇందుకు కారణమని అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. దీంతో ఇలాంటి వాటిని గుర్తించి, నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు చర్యలు వేగవంతంచేశారు. ఇక పాత అసైన్డ్, గ్రామకంఠ భూముల్లో ఇప్పటికే వెలిసిన నివాస ప్రాంతాలు, ఇండ్లకు సంబంధించి ప్రత్యేక గైడ్‌లైన్స్ రూపొందించబోతున్నారు. ఆయా ఇండ్లు, జాగల్లో ఎన్నేండ్లుగా నివాసముంటున్నారు? ఎన్నేండ్లుగా పన్నుల కడ్తున్నారు? అనే వివరాలు సేకరి స్తారు. ఏదో ఒక సంవత్సరాన్ని కట్ఆఫ్గా పెట్టుకొని అంతకుముందు నిర్మించుకున్న ఇండ్లన్నింటినీ నిషేధిత జాబితాలోంచి తొలగించే అవకాశమున్నట్టు తెలుస్తున్నది.
ఆస్తుల సంఖ్య 60లక్షలకు పైగా!
దశాబ్దాల క్రితం గ్రామాలు, పల్లెలు రూపొందించే సమయంలో ప్రజలు ఇండ్లు నిర్మించుకునేందుకు ప్రత్యేకంగా కేటాయించుకున్న భూములనే గ్రామ కంఠం లేదా ఆబాదీగా పిలుస్తున్నారు. ఈ భూముల్లో సగానిపైగా ఇండ్లకు సర్వే నంబర్లు లేవు. లేదా ఆ ఊరు మొత్తానికి ఒకటే సర్వే నంబర్ ఉంటుంది. ఇంటి నంబర్ కేటాయించడం తప్ప ఆయా ఇండ్లు ఎంత విస్తీర్ణంలో ఉన్నాయనే వివరాలు పంచాయతీ రికార్డుల్లో నమోదై లేవు. ఈ క్రమంలో 2020 అక్టోబర్‌లో నిర్వహించిన వ్యవసాయేతర ఆస్తుల సర్వే ప్రకారం పంచాయతీల్లో సుమారు 60 లక్షల ఆస్తులను గుర్తించారు.
ఇందులో సగానికిపైగా ఇండ్లకు ఎలాంటి రిజిస్ట్రేషన్లు లేవు. తాతలు, తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఇండ్లకు సంబంధించి ఓనర్ల దగ్గర ఇంటి పన్ను రశీదు తప్పా వేరే ఆధారాల్లేవు. ఈ ఇండ్లను అమ్మే, కొనే పరిస్థితి లేదు. ఆయా జాగల్లో పాత ఇండ్లు కూల్చి కొత్త ఇండ్లు కట్టుకుందామంటే పర్మిషన్లు, బ్యాంకు లోన్లు రావడం లేదు. ఇంటి నిర్మాణ అనుమతులకు అప్లై చేసినప్పుడు రిజిష్టర్డ్ డాక్యుమెంట్లు అడుగుతుండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీటితోపాటు దశాబ్దాల క్రితం అప్పటి ప్రభుత్వాలు పేదలకు అసైన్డ్ చేసిన నివాస స్థలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది. ఓవైపు ఇంటి పన్నులు, నల్లా పన్నులు వసూలు చేస్తూనే మరోవైపు ఆస్తులను నిషేధిత జాబితాలో పెట్టడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ప్రజల నుంచి కలెక్టర్లకు, ప్రజాప్రతినిధులకు అర్జీలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో క్షేత్రస్థాయి పరిస్థితులను గుర్తించిన ప్రభుత్వం, తరతరాలుగా అసైన్డ్, గ్రామకంఠం భూముల్లో నివాసముంటున్న పేద, మధ్యతరగతి వర్గాలకు ఊరట కలిగించేలా నిషేధిత జాబితా నుంచి ఆయా ఆస్తులను తొలగించేందుకు సమగ్ర కార్యాచరణ సిద్ధం చేస్తున్నది.
