ఖమ్మం టౌన్, వెలుగు : చేసిన పనులకు బిల్లు మంజూరు చేయకపోవడాన్ని నిరసిస్తూ ఓ కాంట్రాక్టర్ స్కూల్ కు తాళం వేశాడు. ఈ ఘటన ఖమ్మం నగరంలోని దానవాయి గూడెం ప్రైమరీ స్కూల్ వద్ద సోమవారం జరిగింది. కాంట్రాక్టర్ చల్లా అయోధ్య పట్టణ ప్రగతిలో భాగంగా స్కూల్ లో టాయిలెట్స్, కాంపౌండ్ వాల్ నిర్మించడం, ట్యాప్స్ బిగించడం వంటి పనులు చేశారు. వీటికి సంబంధించి మొత్తం రూ. 13 లక్షల బిల్లు రావాల్సి ఉంది. రోజులు గడుస్తున్నా బిల్లు మంజూరు కాకపోవడంతో కాంట్రాక్టర్ అయోధ్య సోమవారం తన కుటుంబ సభ్యులతో కలిసి పెట్రోల్ డబ్బాతో స్కూల్ వద్దకు చేరుకోని గేటుకు తాళం వేసి ఆందోళనకు దిగారు. దీంతో స్కూల్ కు వచ్చిన స్టూడెంట్లు, టీచర్లు గేటు బయటే వేచి ఉన్నారు. విషయం తెలుసుకున్న ఎంఈవో శైలజారాణి కాంట్రాక్టర్ తో మాట్లాడారు. బిల్లు మంజూరు అయ్యేలా కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో కాంట్రాక్టర్ అయోధ్య ఆందోళన విరమించి తాళం తీశారు.
