ఇంఫాల్: మణిపూర్ కొత్త సీఎంగా బీజేపీ నేత ఖేమ్ చంద్ సింగ్ (62) ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం ఇంఫాల్‌లోని లోక్ భవన్‌లో గవర్నర్ అజయ్ కుమార్ భల్లా ఆయనతో ప్రమాణం చేయించారు. రాష్ట్రంలో జాతి సమతుల్యతను కాపాడేందుకు ప్రభుత్వం ఇద్దరు డిప్యూటీ సీఎంలను నియమించింది. కుకీ సామాజిక వర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే నెమ్చా కిప్గెన్, నాగా పీపుల్స్ ఫ్రంట్(ఎన్పీఎఫ్) ఎమ్మెల్యే దిఖో డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ నుంచి గోవిందాస్ కొంతుజామ్, నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్ పీపీ) నుంచి కె. లోకెన్ సింగ్ మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు.
రాష్ట్రపతి పాలన రద్దు చేస్తూ ప్రెసిడెంట్ ప్రకటన
మణిపూర్‌లో మెయితీ, కుకీ వర్గాల మధ్య ఉద్రిక్తతలు చెలరేగడంతో ప్రభుత్వం గతేడాది రాష్ట్రపతి పాలన విధించింది. ఆందోళనల నేపథ్యంలో సీఎం బీరేన్ సింగ్ తన పదవీకి రాజీనామా చేశారు. దీంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మణిపూర్‌లో ప్రెసిడెంట్ రూల్ విధించారు. తాజాగా బుధవారం ప్రెసిడెంట్ రూల్‌ను ఎత్తివేస్తూ అధికారిక ప్రకటన జారీ చేశారు. ‘‘2025 ఫిబ్రవరి 13న మణిపూర్‌లో రాష్ట్రపతి పాలనను విధిస్తూ జారీ చేసిన ప్రకటనను 2026 ఫిబ్రవరి 4వ తేదీ నుంచి రద్దు చేస్తున్నాను”అని పేర్కొన్నారు.
