ఇబ్రహీంపట్నం మున్సిపల్‌‌ ఎన్నిక కేసులో నన్ను ఇంప్లీడ్‌‌ చేయండి : కిడ్నాప్‌‌నకు గురైన యాదగిరి

ఇబ్రహీంపట్నం మున్సిపల్‌‌ ఎన్నిక కేసులో నన్ను ఇంప్లీడ్‌‌ చేయండి : కిడ్నాప్‌‌నకు గురైన యాదగిరి
  • కిడ్నాప్‌‌నకు గురైన యాదగిరి హైకోర్టులో పిటిషన్‌‌

హైదరాబాద్, వెలుగు: ఇబ్రహీంపట్నం చైర్మన్, వైస్‌‌చైర్మన్‌‌ ఎన్నిక ఫలితాలను ప్రకటించాలంటూ దాఖలైన పిటిషన్‌‌లో తనను ప్రతివాదిగా చేర్చుకొని వాదనలు వినాలంటూ కిడ్నాప్‌‌నకు గురైన యాదగిరి హైకోర్టులో ఇంప్లీడ్‌‌ పిటిషన్‌‌ దాఖలు చేశారు. దీనిపై అభ్యంతరాలుంటే చెప్పాలంటూ విచారణను హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. చైర్మన్‌‌గా తన ఎంపిక ప్రక్రియ పూర్తయినా.. అధికారికంగా ప్రకటించకపోవడాన్ని సవాలు చేస్తూ టేకుల సుదర్శన్‌‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌‌ దాఖలు చేశారు.

వార్డు కౌన్సిలర్‌‌ యాదగిరి కిడ్నాప్‌‌ అయ్యారంటూ ఆయన కుమారుడు హెబియస్‌‌ కార్పస్‌‌ పిటిషన్‌‌ దాఖలు చేయడంతో చైర్మన్‌‌ ఎన్నికను నిలిపివేస్తూ ఇదే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చిందని పిటిషనర్‌‌‌‌ పేర్కొన్నారు. హైకోర్టు ఉత్తర్వులు అందేసరికే చైర్మన్‌‌ ఎన్నిక పూర్తయిందని, అధికారికంగా ప్రకటించకుండా నిలిపివేశారన్నారు. ఆపై హైకోర్టు ఎన్నికలను అనుమతించిందన్నారు. యాదగిరి తరఫు లాయర్‌‌‌‌ వాదిస్తూ బీఆర్‌‌‌‌ఎస్‌‌ నేత మంచిరెడ్డి కిషన్‌‌రెడ్డి, ఆయన కుమారుడు ప్రశాంత్‌‌.. యాదగిరిని బాపట్లకు తరలించి, తర్వాత ఇక్కడ ఫాంహౌస్‌‌లో నిర్బంధించారన్నారు. ఇంప్లీడ్‌‌ పిటిషన్‌‌ను అనుమతించాలని కోరారు.