మేడ్చల్ జిల్లా, ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కిడ్నాప్ కలకలం రేపింది. మేడిపల్లి శివారులో ఉంటున్న అవినాష్ రెడ్డి అనే వ్యక్తి.. తన క్లాస్మేట్ అయిన అన్షిత రెడ్డిని ప్రేమించాడు. వీరి మధ్య ప్రేమాయణం కొన్నేళ్ల పాటు సాఫీగా సాగింది. ఈ క్రమంలో యువతి.. డబ్బులు కావాలని అడగడంతో ప్రియుడు పెద్ద మొత్తంలో ఆమెకు డబ్బులు ఇచ్చాడు. డబ్బులు చేతికందాక ప్రియురాలు రూటు మార్చింది. అవినాష్ రెడ్డికి దూరంగా ఉంటూ మరొకరితో ప్రేమాయణం మొదలు పెట్టింది.
ఈ విషయం తెలుసుకున్న ప్రియుడు ఆమెను డబ్బులు తిరిగివ్వాలని అడగడంతో.. యువతి అతని కిడ్నాప్‌కు ప్లాన్ రచించింది. మొదట వీరిద్దరూ సాన్నిహిత్యంగా మెలిగిన ఫోటోలను తొలగించడానికి సిద్దిపేటకు చెందిన చక్రదర్ గౌడ్‌తో ఫోన్ చేపించింది. అతడు అవినాష్ రెడ్డి వద్ద ఉన్న ఫోటోలు, వీడియోలు తొలగించాలని.. లేని పక్షంలో డబ్బులు తిరిగి ఇవ్వమని బెదిరించాడు. అనంతరం డీల్ పూర్తి చేద్దామంటూ మెసేజ్ పెట్టిన చక్రధర్ గౌడ్.. ఘట్‌కేసర్ పరిధిలోని వరంగల్ హైవేపై ఉన్న ఓ హోటల్ వద్దకు రమ్మని చెప్పాడు.
నిజమని నమ్మిన యువకుడు డబ్బులు కోసం అక్కడికి వెళ్లగా.. కొందరు దుండగులు కారులో వచ్చి అతన్ని కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. అంతలోనే అక్కడున్న కొందరు గట్టిగా కేకలు వేయడంతో.. వారు అక్కడినుండి పరారయ్యారు. అనంతరం బాధిత యువకుడు.. ఈ విషయమై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. యువతి.. చక్రధర్ గౌడ్‌తో సహజీవనం చేస్తున్నట్లు యువకుడు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
