- కాళేశ్వరంపై హైకోర్టు తీర్పు.. ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం
- రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్, బీఆర్ఎస్పార్టీలు మోసం చేస్తున్నయ్: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య జరుగుతున్న పోరాటం కేవలం 'ఉత్తుత్తి ఫైటింగ్' అని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ప్రజలను ఈ రెండు పార్టీలు మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. బుధవారం ఆయన కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విషయంలో హైకోర్టు ఇచ్చిన స్టే, కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థతకు నిదర్శనమని ఆరోపించారు.
ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటి తీర్పు అని విమర్శించారు. ఈ విషయంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ అవినీతి పాలన వద్దని, మార్పు కావాలని తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించారన్నారు.
తెలంగాణను దోచుకోవడంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య దోస్తీ ఉందని ఆరోపించారు. ‘‘అధికారంలోకి రాగానే కేసీఆర్, ఆయన కుటుంబం, మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన అవినీతిపై కఠిన చర్యలు తీసుకుంటామని, దోచుకున్న సొమ్మును కక్కిస్తామని రేవంత్ రెడ్డి పదే పదే చెప్పారని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా.. ఫార్ములా వన్ రేస్, డ్రగ్స్ కేసు, భూ ఆక్రమణలు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాలలో జరిగిన అవినీతిపై ఒక్క సమగ్ర దర్యాప్తు కూడా చేపట్టలేదని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి పాలన పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపించారు. ఈ రెండు పార్టీలు రాష్ట్రాన్ని నాశనం చేసేందుకు పన్నాగం పన్నాయని కిషన్రెడ్డి ఆరోపించారు.

