విమోచనం రోజునే సీడబ్ల్యూసీ మీటింగ్ ఏంది?: కిషన్​రెడ్డి

విమోచనం రోజునే సీడబ్ల్యూసీ మీటింగ్ ఏంది?: కిషన్​రెడ్డి

హైదరాబాద్, వెలుగు :  తెలంగాణ విమోచనం రోజైన సెప్టెంబర్ 17న హైదరాబాద్ వేదికగా కాంగ్రెస్ పార్టీ​ వర్కింగ్​ కమిటీ మీటింగ్​ పెట్టుకోవడం ఏమిటని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ అమరుల మీద కాంగ్రెస్ కు ఏమాత్రం గౌరవం ఉన్నా.. ఇదే రోజున వర్కింగ్​ కమిటీ మీటింగ్ పెట్టేది కాదని అన్నారు. ‘‘తెలంగాణ విమోచన చరిత్రను ప్రజలకు తెలియకుండా తొక్కిపెట్టిందే కాంగ్రెస్. ఈ విషయంలో మొదటి దోషి ఆ పార్టీనే. అందుకే కాంగ్రెస్ నాయకులు చేసిన తప్పుకు చార్మినార్​ భాగ్యలక్ష్మి ఆలయం దగ్గర రక్తం కారేలా ముక్కు నేలకు రాసి మీటింగ్ నిర్వహించుకోవాలి” అని చెప్పారు. 

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్​లో ఆదివారం జరగనున్న తెలంగాణ విమోచన దినోత్సవ ఏర్పాట్లను శనివారం కిషన్ రెడ్డి పరిశీలించారు. అనంతరం అక్కడే  మీడియాతో మాట్లాడారు. తెలంగాణ విమోచన చరిత్రను ప్రజలకు తెలియకుండా కాంగ్రెస్​ తొక్కిపెట్టిన నిజాన్ని ఇక్కడి ప్రజలు తెలుసుకోవాలని కోరారు. ‘‘ఓటు బ్యాంకు రాజకీయాల కోసం రజాకార్ల వారసుల పార్టీతో కలిసి కాంగ్రెస్ తెలంగాణ విమోచన చరిత్రను సమాధి చేసింది. కాంగ్రెస్​ అధికారంలో ఉన్నప్పుడు విమోచన దినోత్సవం జరపాలని మేము డిమాండ్​ చేస్తే.. మమ్మల్ని కొట్టి జైల్లో పెట్టింది. ఇలాంటి చరిత్ర గల కాంగ్రెస్​కు ఇక్కడ ఇంతటి చారిత్రాత్మకమైన రోజైన సెప్టెంబర్​ 17న వర్కింగ్​ కమిటీ మీటింగ్​ పెట్టుకునే నైతిక హక్కు ఎక్కడిది?” అని నిలదీశారు. విమోచన చరిత్రను కాంగ్రెస్ సమాధి చేస్తే.. ఆ చరిత్రనుబీజేపీ బయటకు తీసిందన్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా విమోచన వేడుకలను నిర్వహిస్తున్నదని చెప్పారు. 

సమైక్యతా దినోత్సవం ఎట్లయితది?

తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించే ధైర్యం లేనందుకే సీఎం కేసీఆర్​ సమైక్యతా రాగం అందుకున్నారని కిషన్​రెడ్డి మండిపడ్డారు. ‘‘రాష్ట్రంలోని అధికార పార్టీ బీఆర్ఎస్​.. సెప్టెంబర్​ 17ను జాతీయ సమైక్యత దినోత్సవం అంటుంది.. ఇది ఎట్ల సమైక్యతా దినోత్సవం అవుతుందో సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలి? 80 వేల పుస్తకాలు చదివినా అని  చెప్పే కేసీఆర్ విమోచన దినం.. సమైక్యత దినం .. గురించి వివరించాలి. వేలాది మంది మహిళలను చెరిచి, ఇక్కడి ప్రజలను రజాకార్లు కాల్చి చంపితే.. కేంద్ర ప్రభుత్వం పోలీస్​ చర్య ద్వారా నిజాంను ఓడించి ఇక్కడ జెండా ఎగురవేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలి” అని కిషన్​రెడ్డి అన్నారు.

ALSO READ:  అమిత్ షాతో పీవీ సింధు భేటీ

 ‘‘కేసీఆర్​ కు సవాలు విసురుతున్నా.. విమోచనం, సమైక్యతపై పరకాల అమరధామం వద్ద చర్చకు సిద్ధమా..” అని ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉత్సవాలు నిర్వహిస్తున్నదని ఆగమైన కేసీఆర్.. ప్రగతిభవన్​ నుంచి నిద్రలేచి సమైక్యతా ఉత్సవాలు అంటున్నారని దుయ్యబట్టారు. ‘‘కేంద్ర ప్రభుత్వ అధికారికంగా విమోచన ఉత్సవాలను నిర్వహిస్తుండగా.. ఇక్కడి పోలీసులు మాత్రం పార్టీ మీటింగ్​ అంటూ సర్క్యులర్​ జారీ చేయడం ఏంది? ఈ సర్క్యులర్​ జారీ చేసిన పోలీసులు వెంటనే క్షమాపణ చెప్పాలి. దీనిపై కేంద్రం చాలా సీరియస్ గా ఉంది” అని ఆయన హెచ్చరించారు. 

తెలంగాణ, మహారాష్ట్ర, కర్నాటక సీఎంలను ఆహ్వానించాం

పరేడ్​ గ్రౌండ్​లో కేంద్ర ప్రభుత్వం నిర్వహించే విమోచన వేడుకల్లో పాల్గొనాలని కోరుతూ తాను స్వయంగా తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక సీఎంలకు  లేఖలు రాశానని కిషన్ రెడ్డి చెప్పారు. గత ఏడాది కూడా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో విమోచన ఉత్సవాలను ఇదే పరేడ్​ గ్రౌండ్​లో నిర్వహించామని గుర్తు చేశారు. నిజాంకు, రజాకార్లకు వ్యతిరేకంగా ఎవరైతే పోరాటం చేశారో.. వాళ్ల ఆకాంక్షలకు తగ్గట్టుగా కేంద్ర ప్రభుత్వం ఈ విమోచన దినోత్సవాలను జరుపుతున్నదని తెలిపారు.