పాలనలో మార్పు రాలేదు..ప్రజా పాలన కాదు.. ఇది ప్రజావంచన పాలన : కిషన్ రెడ్డి

పాలనలో మార్పు రాలేదు..ప్రజా పాలన కాదు.. ఇది ప్రజావంచన పాలన : కిషన్ రెడ్డి
  • కేసీఆర్​ పోయి రేవంత్​ వచ్చిండు తప్ప దోపిడీ ఆగలేదు: కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి
  • ప్రజా పాలన కాదు.. ఇది ప్రజావంచన పాలన 
  • దమ్ముంటే హామీల అమలుపై చర్చకు రావాలి
  • గతంలో ‘సీఎం అండ్​ సన్​’..  ఇప్పుడు ‘సీఎం అండ్​ బ్రదర్స్​’ పాలన: రాంచందర్​ రావు 
  • బీజేపీ ఫార్మాట్​ మారాలి.. టెస్ట్​ మ్యాచ్​ కాదు.. ట్వంటీ ట్వంటీ ఆడాలి: రాకేశ్​రెడ్డి
  • ఇందిరా పార్క్​ ధర్నా చౌక్​లో బీజేపీ మహాధర్నా.. చార్జ్​షీట్​ రిలీజ్​

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేండ్లయినా జనం బతుకులు మారలేదని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి అన్నారు. ‘‘కేసీఆర్ పోయి రేవంత్ వచ్చుడు తప్ప.. పాలనలో, దోపిడీలో ఏ మాత్రం తేడా లేదు” అని విమర్శించారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలను కాంగ్రెస్​ ప్రభుత్వం మోసం చేసిందని ఆయన ఆరోపించారు.  ఆదివారం ‘ప్రజా వంచన దినం’ పేరుతో బీజేపీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నాచౌక్ వద్ద ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్​ రావు అధ్యక్షతన మహాధర్నా జరిగింది.  రేవంత్ సర్కార్  ప్రజలను మోసం చేసిందంటూ ‘చార్జ్‌‌‌‌షీట్’ను బీజేపీ నేతలు రిలీజ్ చేశారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. ‘‘బీఆర్​ఎస్​ పదేండ్ల పాపాలను కాంగ్రెస్​ రెండేండ్లలోనే చేసింది. హామీల అమలులో రేవంత్​ రెడ్డి సర్కార్​ పూర్తిగా విఫలమైంది. దమ్ముంటే హామీల అమలుపై చర్చకు రావాలని సీఎం రేవంత్​ కు సవాల్​విసురుతున్న.  ఇది ప్రజా పాలన కాదు.. ఇది ప్రజావంచన పాలన” అని దుయ్యబట్టారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని బీఆర్​ఎస్​ అప్పుల కుప్పగా మార్చిందని, దాన్ని కాంగ్రెస్​ మరింత దిగజార్చిందని కిషన్​రెడ్డి దుయ్యబట్టారు.

 ‘‘ప్రజలు మార్పు కోరుకొని కాంగ్రెస్​కు ఓటేస్తే.. రెండేండ్లలో ఏ వర్గానికీ న్యాయం జేసినవ్​ రేవంత్? ఒక్క హామీ సరిగ్గా అమలు కాలే. నిరుద్యోగ భృతి ఏమైంది? రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ? కౌలు రైతులు, మహిళలకు ఇచ్చిన మాట ఏమైంది?’’ అని ఆయన ప్రశ్నించారు. ‘‘ఇచ్చిన హామీలు గాలికి వదిలేసి..  విజయోత్సవాలు చేసుకోవడం సిగ్గుచేటు” అని విమర్శించారు. కేంద్రం కిలో బియ్యానికి రూ.43 ఇస్తుంటే, రాష్ట్రం ఇచ్చేది  రూ.13 మాత్రమేనని, కానీ మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తున్నట్లు రేవంత్​ గొప్పలు చెప్పుకుంటున్నారని దుయ్యబట్టారు.  ‘‘వైఎస్సార్, కేసీఆర్​ హయాంలో జరిగినట్లే ఇప్పుడు కూడా ఫిరాయింపులు జరుగుతున్నయ్​. ఇందిరా పార్క్​ వేదికగానా.. ప్రజా భవనా..  ప్రెస్​ క్లబ్​లోనా? ఎక్కడైనా సరే చర్చకు నేను సిద్ధం.. నువ్వు సిద్ధమా?’’ అని సీఎం రేవంత్​రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి సవాల్​ విసిరారు. కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ రెండూ కుటుంబ పార్టీలేనని, అవినీతి పార్టీలేనని ఆయన దుయ్యబట్టారు. 

రైజింగ్ తెలంగాణ కాదు.. డ్రగ్స్ తెలంగాణ: లక్ష్మణ్

రేవంత్ పాలన 420 హామీల ఫేక్ పాలన అని ఎంపీ లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. ‘‘రైజింగ్ తెలంగాణ అని రేవంత్ ముచ్చట్లు చెప్తుండు. కానీ రాష్ట్రంలో డ్రగ్స్ కల్చర్, గన్ కల్చర్ రైజింగ్ అవుతున్నది. పగలే పోలీసులను కాల్చి చంపుతున్నరు’’ అని మండిపడ్డారు. ఇచ్చిన హామీలు అమలు చేసేంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటాడుతాం, వేటాడుతామని ఆయన అన్నారు. ‘‘అప్పులు పుట్టడం లేదని, చెప్పులు ఎత్తుకుపోతున్నారని చెప్పిన రేవంత్.. ఇప్పుడు గ్లోబల్ సమిట్ పేరుతో జిమ్మిక్కులు చేస్తున్నడు”  అని విమర్శించారు.  

హిల్ట్​ స్కామ్​ను రుజువు చేయకుంటే రాజీనామా చేస్త: ఏలేటి

హిల్ట్​ పాలసీ పేరుతో రూ.6.30 లక్షల కోట్ల కుంభకోణానికి స్కెచ్​ వేశారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్​ రెడ్డి ఆరోపించారు. దీనిపై సాక్ష్యాలతో రుజువు చేయకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, రాజకీయ సన్యాసం తీసుకుంటానని తెలిపారు. పార్టీ ఆదేశిస్తే ఆమరణ దీక్షకైనా రెడీ అని ఆయన సవాల్​ చేశారు. రేవంత్​ రెడ్డిది ప్రజా పాలన కాదు.. ప్రజా వంచన పాలన అని ఎంపీ డీకే అరుణ విమర్శించారు. కాంగ్రెస్​ పార్టీ ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నదని ఎమ్మెల్యే పాయల్​ శంకర్​ దుయ్యబట్టారు. కార్యక్రమంలో బీజేపీ జాతీయ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి, మురళీధర్, ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీ మల్క కొమరయ్య, అంజిరెడ్డి, మాజీ ఎంపీలు బూర నర్సయ్యగౌడ్, బీబీపాటిల్, సీతారాంనాయక్ , పెద్దిరెడ్డి,  ఆ పార్టీ నేతలు కాసం వెంకటేశ్వర్లు, ప్రేమేందర్ రెడ్డి, ఎన్వీసుభాష్, బండ కార్తీకారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

అర్బన్ నక్సలైట్లను అంతం చేస్తం: రాంచందర్​ రావు 

కాంగ్రెస్​ పాలనలో సామాన్యులకు ఒరిగింది శూన్యమని, ఇది కేవలం కమీషన్ల ప్రభుత్వమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్​రావు ఆరోపించారు. ‘‘గతంలో బీఆర్​ఎస్​ హయాంలో ‘సీఎం అండ్​ సన్​’ మోడల్​ ఉండేది.. ఇప్పుడు కాంగ్రెస్​ పాలనలో ‘సీఎం అండ్​ బ్రదర్స్​’ మోడల్​ నడుస్తున్నది’’ అని ఆయన విమర్శించారు. ‘‘420 హామీలు, 6 గ్యారంటీలు ఇచ్చి ప్రజలను నట్టేట ముంచారు. ఫీజు రీయింబర్స్​మెంట్​, ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించలేక చేతులెత్తేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ, బాబ్రీ మసీదు కడతామనే వాళ్లను కాంగ్రెస్​ పెంచి పోషిస్తున్నది. బీజేపీకి తెలంగాణలోని మూడు కోట్ల మందే దేవుళ్లు.. కానీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం సోనియా, రాహుల్, ప్రియాంక.. ఈ ముగ్గురే దేవుళ్లు” అని వ్యాఖ్యానించారు. కేంద్రం నక్సలిజాన్ని అంతం చేస్తుంటే.. రేవంత్​ సర్కార్​ అర్బన్​ నక్సలైట్లకు ఆశ్రయం ఇస్తున్నదన్నారు.  రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే అర్బన్ నక్సలైట్లను పూర్తిగా అంతం చేస్తామని స్పష్టం చేశారు.  ‘‘టీఆర్ఎస్ పేరు మార్చుకుని బీఆర్ఎస్ అయింది. ఇప్పుడు ఆ పార్టీ రాజకీయాల నుంచి వీఆర్ఎస్  తీసుకుంది” అని ఆయన విమర్శించారు.  

ట్వంటీ ట్వంటీ ఆడుదాం: రాకేశ్​ రెడ్డి

‘‘రాష్ట్రంలో మనం ఇంకా ఎన్నాళ్లు టెస్ట్​ మ్యాచ్​లు ఆడుదాం? 40 ఏండ్ల నుంచి పోరాటాలు చేసి చేసి కార్యకర్తలు అలిసిపోయిన్రు. ఇకనైనా పంథా మార్చాలి. టెస్ట్​ మ్యాచ్​లు బంద్​ పెట్టి ట్వంటీ ట్వంటీ స్టైల్​లో ఆడి అధికారంలోకి రావాలి” అని ధర్నాలో బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి అన్నారు. మ్యాచులో సిక్సులు, సెంచరీలు కొట్టేటోళ్ల సేవలను ఉపయోగించుకోవాలని సూచించారు. రాష్ట్రంలో రాజకీయ ఫార్మాట్​ను మార్చాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘మనం ఎన్ని మ్యాచ్​లు ఆడినం అన్నది ముఖ్యం కాదు.. మ్యాచ్​ గెలిచినామా లేదా అన్నదే ముఖ్యం. బీజేపీ కార్యకర్తల రక్తం మరుగుతున్నది. బిహార్​, హర్యానా, మహారాష్ట్రలో కొట్టినట్టు తెలంగాణలో కూడా గెలవాలి’’ అని ఆయన పేర్కొన్నారు. ‘‘సీఎం రేవంత్​ రెడ్డి పాలన అబద్ధాలు, అవినీతి, అరాచకాలతో కొనసాగుతున్నది. సిరిగల తెలంగాణను గత ప్రభుత్వం సగం తాకట్టు పెడితే.. ఇప్పుడున్న సీఎం రాష్ట్రాన్ని మొత్తం అమ్మేస్తున్నరు. దుర్మార్గమైన ప్రభుత్వాన్ని చీల్చి చెండాడాలంటే బీజేపీ తన పోరాట పంథాను మార్చుకోవాలి” అని వ్యాఖ్యానించారు.