రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లా 152/6
ఇండియా తొలి ఇన్నింగ్స్ 347/9 డిక్లేర్
కింగ్ కోహ్లీ సెంచరీ
హిస్టారికల్ ‘పింక్’ విజయానికి ఇండియా చేరువైంది..! విప్లవాత్మక మార్పులో విశేషంగా రాణించింది..! మొత్తానికి అత్యంత ఆందోళన, ఉత్కంఠ రేకెత్తించిన ‘గులాబీ టెస్ట్’లో ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యేందుకు నాలుగు అడుగుల దూరంలో నిలిచింది..! డేనైట్‌లోనూ తన హవా జోరుగా చూపెట్టిన విరాట్ కోహ్లీ (194 బంతుల్లో 18 ఫోర్లతో 136) తొలి పింక్ సెంచరీతో డిస్టింక్షన్ సాధించగా, ‘లంబు’ ఇషాంత్ (4/39) మళ్లీ దుమ్మురేపాడు..! కళ్లముందున్న కొండంత ఆధిక్యాన్ని కరిగించే క్రమంలో పెవిలియన్‌కు క్యూ కట్టిన బంగ్లా బ్యాట్స్‌మెన్.. ఇన్నింగ్స్ ఓటమికి అతి దగ్గరలో ఉన్నారు..! ఓవరాల్‌గా స్వదేశంలో 12వ సిరీస్ విజయాన్ని విరాట్‌సేన లాంఛనమే చేసింది..!!
కోల్‌కతా:పాపం.. పింక్ టెస్ట్‌లోనూ బంగ్లాదేశ్‌కు ఏదీ కలిసి రాలేదు. తొలి ఇన్నింగ్స్ మాదిరిగా రెండో ఇన్నింగ్స్‌లోనూ బ్యాటింగ్‌లో అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దీనికితోడు బౌలింగ్‌లోనూ చేతులెత్తేసింది. వికెట్లు తీసినా.. టీమిండియా భారీ స్కోరుకు మాత్రం అడ్డుకట్ట వేయలేకపోయింది. ఫలితంగా రెండో రోజే విరాట్‌సేన విజయం ఖాయమవుతుందనుకున్నా.. వెటరన్ బ్యాట్స్‌మన్ ముష్ఫికర్ (59 బ్యాటింగ్) ఫైటింగ్ స్పిరిట్‌తో ఆట మూడో రోజుకు వెళ్లింది. శనివారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 32.3 ఓవర్లలో 6 వికెట్లకు 152 పరుగులు చేసింది. టాప్–4లో ఇద్దరు డకౌట్ కాగా మరో ఇద్దరు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితం కావడం బంగ్లా కొంప ముంచింది. ప్రస్తుతం బంగ్లా ఇంకా 89 రన్స్ వెనుకబడి ఉంది. అంతకుముందు 174/3 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన ఇండియా తొలి ఇన్నింగ్స్‌ను 89.4 ఓవర్లలో 347/9 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. అజింక్యా రహానె (69 బంతుల్లో 7 ఫోర్లతో 51) హాఫ్ సెంచరీ చేశాడు.
విరాట్ పింక్ సెంచరీ
59 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో క్రీజులోకి వచ్చిన విరాట్ సూపర్ ఫామ్‌ను చూపెట్టాడు. అద్భుతమైన కవర్, ఆన్ డ్రైవ్స్‌తో పాటు పటిష్టమైన డిఫెన్స్‌తో బంగ్లా పేస్ త్రయాన్ని దీటుగా ఎదుర్కొన్నాడు. రెండో ఎండ్‌లో రహానె కూడా మంచి సహకారాన్ని అందించాడు. వీలైనప్పుడల్లా బంతిని రోప్ దాటించిన ఈ ముంబైకర్.. తైజుల్ (60వ ఓవర్) బౌలింగ్‌లో సింగిల్‌తో వరుసగా నాలుగో హాఫ్ సెంచరీ చేశాడు. కానీ తర్వాతి ఓవర్‌లోనే తైజుల్ (1/80).. రహానెను వెనక్కి పంపాడు. దీంతో నాలుగో వికెట్‌కు 99 రన్స్ భాగస్వామ్యం ముగిసింది. ఈ దశలో జడేజా (12) మెల్లగా ఆడినా.. కోహ్లీ మాత్రం దూకుడు తగ్గించలేదు. 68వ ఓవర్‌లో తైజుల్ బాల్‌ను స్క్వేర్ లెగ్‌లో పంపి డబుల్‌తో 27వ సెంచరీని అందుకున్నాడు. ఈ ఫీట్ తర్వాత జాయేద్ (2/77) వేసిన 71వ ఓవర్‌లో వరుసగా నాలుగు ఫోర్లతో రెచ్చిపోయాడు. తొలి సెషన్‌లో 115 రన్స్ రావడంతో ఇండియా 289/4తో లంచ్‌కు వెళ్లింది. కానీ, బ్రేక్ తర్వాత బంగ్లా పేసర్లు జూలు విదిల్చారు.
దీంతో 13.4 ఓవర్లు మాత్రమే ఆడిన టీమిండియా 5 వికెట్లు కోల్పోయింది. రెండో బాల్‌కే జడేజా ఔట్ కాగా, నాలుగు ఓవర్ల తర్వాత ఇబాదత్ (3/91) బౌలింగ్‌లో విరాట్ కొట్టిన భారీ షాట్‌ను.. రోప్ వద్ద తైజుల్ కళ్లు చెదిరే క్యాచ్ తీసుకున్నాడు. ఈ ఇద్దరు ఐదో వికెట్‌కు 53 రన్స్ సమకూర్చారు. ఓ ఎండ్‌లో సాహా (17 నాటౌట్) నిలకడగా ఆడినా.. రెండో ఎండ్‌లో 10 బంతుల వ్యవధిలో అశ్విన్ (9), ఉమేశ్ (0), ఇషాంత్ (0) పెవిలియన్‌కు చేరారు. దీంతో 308/5తో ఉన్న స్కోరు 331/9కి చేరింది. చివర్లో షమీ (10 నాటౌట్) సిక్సర్‌తో టచ్‌లోకి వచ్చినా.. బంతి బాగా స్వింగ్ అవుతుండటంతో కెప్టెన్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. అల్ అమిన్ 3 వికెట్లు తీశాడు.
‘టాప్’ లేపాడు..
సాయంత్రం వేళ.. రెండో ఇన్నింగ్స్‌కు దిగిన బంగ్లాను ఇషాంత్ మళ్లీ వణికించాడు. షార్ట్ బాల్స్‌తో పాటు స్వింగ్, బౌన్స్‌ను రాబట్టిన లంబూ.. ప్రత్యర్థి టాప్ ఆర్డర్‌ను కూల్చేశాడు. ఇన్నింగ్స్ ఐదో బాల్‌కే షాద్మన్ (0)ను, 3వ ఓవర్‌లో మొమినుల్ (0)ను, 7వ ఓవర్‌లో కయెస్ (5)ను ఔట్ చేశాడు. ఇషాంత్ వేసిన 5వ ఓవర్ తొలి బాల్‌కు మిథున్ రివ్యూ నుంచి గట్టెక్కినా… తర్వాత వేసిన బౌన్సర్ అతని హెల్మెట్‌ను బద్దలు కొట్టడంతో ఆందోళన నెలకొంది. టీమిండియా మొత్తం బ్యాట్స్‌మన్ చుట్టు చేరి సపర్యలు చేయగా, ఫిజియో వచ్చి చికిత్స అందించాడు. కానీ 6వ ఓవర్‌లో ఉమేశ్.. మిథున్‌ను పెవిలియన్‌కు పంపడంతో బంగ్లా 13/4తో పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో ముష్ఫికర్, మహ్మదుల్లా (39 రిటైర్డ్‌హర్ట్) నిలకడగా ఆడారు.
అయితే 19వ ఓవర్‌లో కాలిపిక్క కండరాలు పట్టేయడంతో మహ్మదుల్లా రిటైర్డ్‌హర్ట్ అయ్యాడు. కొత్తగా వచ్చిన మెహిదీ హసన్ () ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. ఫోర్లతో పాటు షమీ బౌలింగ్‌తో సిక్సర్ కొట్టాడు. ముష్ఫికర్ హాఫ్ సెంచరీతో బాగా పోరాడాడు. ఈ క్రమంలో ఈ ఇద్దరి మధ్య ఐదో వికెట్‌కు 51 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. అయితే రెండో స్పెల్‌కు దిగిన ఇషాంత్ మళ్లీ దెబ్బకొట్టాడు. 26వ ఓవర్‌లో మెహిదీని ఔట్ చేయడంతో బంగ్లా113 రన్స్‌కు సగం జట్టును కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయని అశ్విన్.. ముష్ఫికర్‌ను ఇబ్బందిపెట్టినా వికెట్ తీయలేకపోయాడు. డే లాస్ట్ ఓవర్‌లో ఉమేశ్.. తైజుల్ (11) వికెట్ తీయడంతో బంగ్లా మరింత మునిగింది.


