V6 News

హంపికి బీబీసీ అవార్డు

హంపికి బీబీసీ అవార్డు

ఇండియన్‌‌ స్పోర్ట్స్‌‌ విమన్‌‌ ఆఫ్‌‌ ద ఇయర్‌‌గా తెలుగు ప్లేయర్‌‌

న్యూఢిల్లీ: వరల్డ్‌‌ చెస్‌‌ చాంపియన్‌‌, తెలుగు ప్లేయర్ కోనేరు హంపి బీబీసీ ఇండియన్‌‌ స్పోర్ట్స్‌‌ విమన్‌‌ ఆఫ్‌‌ ద ఇయర్‌‌ అవార్డు గెలుచుకుంది. యంగెస్ట్‌‌  గ్రాండ్‌‌మాస్టర్‌‌గా ప్రపంచం దృష్టిని ఆకర్షించి.. చెస్‌‌ వరల్డ్‌‌పై తనదైన ముద్ర వేసిన హంపికి ఫ్యాన్స్‌‌ అత్యధిక ఓట్లు వేసి 2020కి గాను ఈ పురస్కారం కట్టబెట్టారు. 40 మెంబర్ల జ్యూరీ.. హంపితో పాటు రెజ్లర్‌‌ వినేశ్‌‌ ఫొగట్‌‌, స్ప్రింటర్‌‌ ద్యుతీచంద్‌‌, షూటర్‌‌ మను భాకర్‌‌, హాకీ కెప్టెన్‌‌ రాణి రాంపాల్‌‌ను ఈ ఇయర్‌‌ అవార్డుకు నామినేట్‌‌ చేసింది. ఆన్‌‌లైన్‌‌ ఓటింగ్‌‌లో అందరికంటే ఎక్కువ ఓట్లు సాధించిన తెలుగు ప్లేయర్‌‌నే అవార్డు వరించింది. బీబీసీ డైరెక్టర్‌‌ జనరల్‌‌ టివ్‌‌ డేవీ  సోమవారం వర్చువల్‌‌గా నిర్వహించిన అవార్డ్స్‌‌ సెర్మనీలో విజేతలను ప్రకటించారు.  ‘ఈ అవార్డు నాతో పాటు మొత్తం చెస్‌‌ కుటుంబానికే ఎంతో ప్రత్యేకం. చెస్‌‌ ఇండోర్‌‌ గేమ్‌‌. ఇండియాలో క్రికెట్‌‌లాంటి ఆటలకు ఉన్న ఆదరణ దానికి లేదు. అయితే, ఈ అవార్డుతో  చెస్‌‌ ప్రజల దృష్టిని ఆకర్షిస్తుందని కోరుకుంటున్నా. ఇక, నా సంకల్ప బలం, ఆత్మవిశ్వాసం వల్లే ఇన్నేళ్లుగా ఈ ఆటలో ఎన్నో విజయాలు సాధించా. ఓ మహిళా ప్లేయర్‌‌ ఎప్పడూ ఆట నుంచి తప్పుకోవాలని ఆలోచించకూడదు. వివాహం, మాతృత్వం అనేవి లైఫ్‌‌లో ఒక భాగంగా ఉండాలి తప్ప మన జీవిత గమనాన్ని మార్చకూడదు’ అని 33 ఏళ్ల హంపి ఈ సందర్భంగా చెప్పింది. 15 ఏళ్ల వయసులోనే హంపి గ్రాండ్‌‌మాస్టర్‌‌ అయింది. పెళ్లి చేసుకొని, ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా చెస్‌‌లో దూసుకెళ్తోంది. ఇక, వెటరన్‌‌ అథ్లెట్‌‌ అంజూ బాబీ జార్జ్‌‌కు లైఫ్‌‌ టైమ్‌‌ అచీవ్‌‌మెంట్‌‌ దక్కింది. యంగ్‌‌ షూటర్‌‌ మను భాకర్‌‌ ఎమర్జింగ్‌‌ ప్లేయర్‌‌ అవార్డుకు ఎంపికైంది.