తొడగొట్టి తోకముడిచారు..మాతో చర్చించే దమ్ము కాంగ్రెస్ నేతలకు లేదు: కేటీఆర్‌‌‌‌ 

తొడగొట్టి తోకముడిచారు..మాతో చర్చించే దమ్ము కాంగ్రెస్ నేతలకు లేదు: కేటీఆర్‌‌‌‌ 
  • మంత్రి జూపల్లి కోసం 3 గంటలు చూసినా రాలేదు
  • మేము గన్ పార్క్ కు పోకుండా పోలీసులతో అడ్డుకుని డ్రామాలు
  • ఇయ్యాల పారిపోయినా నిత్యం నిలదీస్తూనే ఉంటామని హెచ్చరిక

హైదరాబాద్, వెలుగు: అప్పులపై  చర్చకు సిద్ధమని సవాళ్లు విసిరిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు తీరా సమయం వచ్చేసరికి తోకముడిచి పారిపోయారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విరుచుకుపడ్డారు. తమతో చర్చించే దమ్ము కాంగ్రెస్ నేతలకు లేదని, సవాల్ విసిరి చేతకాక పారిపోయిన వీళ్ల బాగోతాన్ని ఇవాళ రాష్ట్ర ప్రజలంతా కళ్లారా చూశారని ఆయన మండిపడ్డారు. మంత్రి జూపల్లి విసిరిన సవాల్ మేరకు... గురువారం తెలంగాణ భవన్ కు వచ్చిన కేటీఆర్ మీడియాలో మాట్లాడారు. 

తెలంగాణ భవన్ కు వస్తున్నానని ప్రగల్భాలు పలికిన మంత్రి జూపల్లి కృష్ణారావు కోసం మూడు గంటల పాటు వేచి చూసినా రాలేదని కేటీఆర్ మండిపడ్డారు. మంత్రి రాకుండా మొహం చాటేయడంతోపాటు.. మరో చోట డ్రామాకు తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి గన్ పార్క్ వద్ద చర్చకు  సిద్ధమై బయలుదేరిన హరీశ్ రావును, ఇతర నేతల్ని అరెస్టుచేయడం, తమను అడుగడుగునా అడ్డుకోవడం సిగ్గుచేటని ఫైర్ అయ్యారు. అక్కడ మంత్రులు సవాళ్లు విసరడం, ఇక్కడ పోలీసులను పెట్టి అడ్డుకోవడం ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమని కేటీఆర్ అన్నారు. 

దమ్ముంటే ప్రత్యేక అసెంబ్లీ పెట్టాలి...

సీఎం, మంత్రులకు నిజంగానే తమతో చర్చించే దమ్ముంటే వెంటనే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలని కేటీఆర్ సవాల్ విసిరారు. సభలో మైక్ కట్ చేయకుండా తమకు మాట్లాడే అవకాశం ఇస్తే, కాంగ్రెస్ ప్రభుత్వ రెండున్నరేళ్ల అవినీతిని బయటపెడతామని స్పష్టం చేశారు. పరిపాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రభుత్వం నిత్యం ప్రయత్నిస్తోందని, ఇలాంటి శిఖండి రాజకీయాలను తెలంగాణ ప్రజలు అస్సలు సహించరని హెచ్చరించారు. 

బీఆర్ఎస్ పాలనలో  కేవలం 2.80 లక్షల కోట్ల అప్పు చేసిందని ఆర్బీఐ, కాగ్ లెక్కలు చెబుతుంటే, సీఎం, డిప్యూటీ సీఎంలు  పొంతన లేని కాకి లెక్కలతో ప్రజలను మభ్యపెడుతున్నారని దుయ్యబట్టారు. త్వరలోనే రైతు సంగ్రామ సదస్సులు, యువజన, విద్యార్థి సదస్సుల  ద్వారా కాంగ్రెస్ మోసాలను ఎక్కడికక్కడ నిలదీసి, ప్రజలను చైతన్యవంతం చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. సీఎం, మంత్రులు ఇవాళ పారిపోయినా వదిలిపెట్టే ప్రసక్తే లేదని, నాలుగు కోట్ల ప్రజల పక్షాన నిత్యం ప్రజాక్షేత్రంలో నిలదీస్తూనే ఉంటామని కేటీఆర్ స్పష్టం చేశారు. 

కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు.. 

రెండున్నరేళ్లలో అనుముల బ్రదర్స్ రాష్ట్రాన్ని నిలువునా దోచుకుంటున్నారని, అదానిని మించిన ఆస్తులు కూడబెట్టారని కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలో ఆర్ఆర్ టాక్స్ వసూలు చేస్తున్నారని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడినా, ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని కేటీఆర్ బీజేపీని ప్రశ్నించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై జరిగిన ఈడీ దాడుల విచారణ ఏమైందో బండి సంజయ్ సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. 

అమృత్ టెండర్లలో జరిగిన భారీ అవినీతిపై ఎందుకు విచారణ జరపడం లేదని, కాంగ్రెస్ సర్కారులో బీజేపీ ఎంపీలకు కాంట్రాక్టులు ఎలా దక్కుతున్నాయో సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కి రాజకీయాలు తెలంగాణ ప్రజలకు అర్థమయి పోయాయని కేటీఆర్ విరుచుకుపడ్డారు. 

పొంగులేటి కుమారుడు వట్టినాగులపల్లిలో కంపెనీలపై పడి భూములను దోచుకుంటున్నారని కేటీఆర్ విమర్శించారు. మేం హైదరాబాద్‌‌లో లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టాం. దమ్ముంటే పొంగులేటి లక్షా ఒకటో ఇల్లు కట్టి చూపించాలని కేటీఆర్ సవాల్ విసిరారు.