- కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు కేటీఆర్ లెటర్
హైదరాబాద్, వెలుగు: సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని రోడ్లు పదేపదే మూసి వేయకుండా స్థానిక మిలటరీ అథారిటీని ఆదేశించాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను మంత్రి కేటీఆర్ కోరారు. గురువారం ఈ మేరకు ఆయనకు లెటర్ రాశారు. రోడ్లు మూసేస్తుండటంతో అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రోడ్లు మూయకుండా చర్యలు తీసుకోవాలని గతంలోనూ విజ్ఞప్తి చేశామని కేటీఆర్ గుర్తుచేశారు. కరోనా కేసులు సాకుగా చూపి కంటోన్మెంట్‌లోని అలహాబాద్ గేట్ రోడ్డు, గాఫ్ రోడ్, వెల్లింగ్టన్ రోడ్, ఆర్డినెన్స్ రోడ్లు మూసేశారని తెలిపారు. తమ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గిందని, అయినా రోడ్లు మూసేయడం సరికాదన్నారు. కంటోన్మెంట్ బోర్డుకు సమాచారం ఇవ్వకుండానే స్థానిక మిలటరీ అథారిటీ.. రోడ్లు మూసేస్తోందని, ఇది కంటోన్మెంట్ యాక్ట్‌లోని సెక్షన్ 258కి విరుద్ధమన్నారు. మిలటరీ పరిధిలోని రోడ్ల మీదుగా ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి, రోడ్ల విస్తరణకు గతంలో డిఫెన్స్ మినిస్ట్రీ సెక్రటరీతో సంప్రదించామని, దీనిపై తుది నిర్ణయం రావాల్సి ఉందని చెప్పారు.
