సీసీఐ పునరుద్ధరణపై మీ వైఖరేంటి?..రాష్ట్రం రూ.250 కోట్లు ఇస్తే ఓపెన్ చేస్తమని కేంద్రం అంటున్నది: కేటీఆర్

సీసీఐ పునరుద్ధరణపై మీ వైఖరేంటి?..రాష్ట్రం రూ.250 కోట్లు ఇస్తే ఓపెన్ చేస్తమని కేంద్రం అంటున్నది: కేటీఆర్
  • కేంద్రంతో వద్దనుకుంటే.. రాష్ట్రమే స్వయంగా ముందుకురావాలి
  • సీఎం రేవంత్​ రెడ్డికి బహిరంగ లేఖ

హైదరాబాద్, వెలుగు: ఆదిలాబాద్​ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పునరుద్ధరణపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరేంటో చెప్పాలని సీఎం రేవంత్​ రెడ్డిని బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ డిమాండ్​ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులిస్తే సీసీఐ పునరుద్ధరణ సాధ్యమవుతుందని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్​డీ కుమారస్వామి చెప్పారని పేర్కొన్నారు. బుధవారం ఆయన సీసీఐ పునరుద్ధరణ అంశంపై సీఎం రేవంత్​ రెడ్డికి లేఖ రాశారు.

 ‘ఈ నెల 15న కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామిని సీసీఐ సాధన సమితి ప్రతినిధులతో కలిశాం.  తెలంగాణ ప్రభుత్వం రూ.250 కోట్లు ఇస్తే ప్లాంట్​పునరుద్ధరణ సాధ్యమవుతుందని ఆయన చెప్పారు. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదనలుగానీ, రాయితీలు, సహకారంపై అధికారిక సమాచారంగానీ అందలేదని, అందువల్లే ప్రక్రియ ఆలస్యమవుతోందన్నారు.

పరిశ్రమ పునరుద్ధరణపై ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడకపోవడం కాంగ్రెస్​ సర్కారు వైఫల్యానికి నిలువెత్తు నిదర్శనం’ అని విమర్శించారు. ఇప్పటికైనా సీసీఐ పునరుద్ధరణపై తెలంగాణ ప్రభుత్వ వైఖరి ఏంటో చెప్పాలని డిమాండ్​చేశారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకపోతే, తెలంగాణ ప్రభుత్వం స్వయంగా ఈ పరిశ్రమను పునరుద్ధరించే కార్యాచరణ ప్రణాళిక ఏమైనా ఉందా? అని కేటీఆర్​ ప్రశ్నించారు. 

అర్హుల ఓట్లు పోవద్దు

రాష్ట్రంలో లక్షల మంది ఓటర్ల వివరాలు అందుబాటులో లేకపోవడంతో చాలామందికి నోటీసులు జారీ చేయబోతున్నారని, అలాంటి ఓటర్లకు నోటీసులందిన వెంటనే పార్టీ శ్రేణులు మార్గనిర్దేశం చేయాలని కేటీఆర్​ సూచించారు. అర్హులైన వారి పేర్లు ఓటరు జాబితా నుంచి తొలగిపోకుండా చూడాలని సూచించారు. బుధవారం ఆయన నందినగర్​లోని తన నివాసంలో పార్టీ ‘సర్’ పర్యవేక్షణ కమిటీతో సమీక్ష చేశారు. అర్హులైన ఒక్క ఓటరు కూడా మిస్ కాకూడదని, అదే సమయంలో డూప్లికేట్ లేదా అనర్హ ఓటర్లు జాబితాలో ఉండకుండా చూడాలన్నారు.