ఎన్టీపీసీ యాష్ ​పాండ్​తో ‘కుందనపల్లి’కి కష్టాలు

ఎన్టీపీసీ యాష్ ​పాండ్​తో ‘కుందనపల్లి’కి  కష్టాలు
  • ఎండాకాలం దుమ్ము, వానాకాలం బురదతో తిప్పలు
  • ఎన్టీపీసీ యాష్​పాండ్​తో ‘కుందనపల్లి’కి  కష్టాలు 
  • గ్రామాన్ని తీసుకోవాలంటూ రిక్వెస్ట్​ 
  • వేరే చోట పునరావాసానికి డిమాండ్

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం కుందనపల్లిని ఎన్టీపీసీ బూడిద, బురద ముంచెత్తుతోంది.30 ఏండ్ల కింద ఎన్టీపీసీ ఏర్పాటు కోసం పరిసర గ్రామాలకు చెందిన దాదాపు 28 వేల ఎకరాల భూమిని సంస్థ సేకరించి ప్రజలకు పునరావాసం కల్పించింది. పక్కనే ఉన్న కుందనపల్లికి ఎన్టీపీసీ నుంచి ఎలాంటి సమస్యా ఉండదని భావించి వదిలేసింది. అయితే  నిర్మాణం పూర్తయిన తర్వాత అసలు కథ మొదలైంది. గ్రామానికి 100 మీటర్ల దూరంలోనే ఎన్టీపీసీ యాష్​పాండ్​ఏర్పాటు చేసింది. కరెంట్​ ఉత్పత్తి కోసం బొగ్గును కాల్చగా వచ్చే బూడిదతో పాటు బురద ఈ యాష్​పాండ్​లోకి చేరుతోంది. వానాకాలంలో బూడిద, బురదతో చెరువు నిండి ఓవర్​ఫ్లో అయి ఊర్లోకి వస్తోంది. ఎండాకాలంలో బూడిద ఆరిపోయి గాలి వీచినప్పుడు దుమ్ముగా మారి ఊరిని ముంచెత్తుతోంది. ఈ యాష్ పాండ్ వల్ల అండర్​గ్రౌండ్​వాటర్​ కలుషితం కావడంతో పాటు ఎయిర్​పొల్యూషన్​ కూడా ఏర్పడుతోంది. దీంతో ప్రజలు లంగ్స్, కండ్లకు సంబంధించిన రోగాలతో బాధపడుతున్నారు. ఈ కష్టాలతో తాము బతకలేమని, తమ గ్రామాన్ని ఎన్టీపీసీ తీసుకొని వేరే చోట పునరావాసం కల్పించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

ఈ ఊరు మాకొద్దు  
బూడిద సమస్య ఎంతకూ తీరకపోవడంతో గ్రామస్థులు తమ ఊరిని ఎన్టీపీసీ తీసుకోవాలని రిక్వెస్ట్​ చేస్తున్నారు. తమకు వేరేచోట పునరావాసం కల్పించాలని కోరుతున్నారు. అండర్​గ్రౌండ్​వాటర్​ చెడిపోయిందని, బోర్లు, బావుల నీళ్లతో స్నానాలు చేస్తే స్కిన్​ ఎలర్జీస్​ వస్తున్నాయని చెబుతున్నారు. యాష్​పాండ్​లో దిగబడి బర్లు, ఆవులు చనిపోతున్నాయంటున్నారు.  పెద్దపల్లి జిల్లాగా ఏర్పడినప్పటి నుంచి వచ్చిన కలెక్టర్లందరికీ తమ పరిస్థితి చెప్పామని, అయినా ఒక్కరూ పట్టించుకోలేదంటున్నారు. ఎన్టీపీసీ ఆఫీసర్లతో పాటు స్థానిక అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేదంటున్నారు. ప్రస్తుత  కలెక్టర్ సంగీత సత్యనారాయణకు ఈ మధ్య కలిసి చెప్పగా సమస్యను పీసీబీకి రిఫర్​ చేస్తామని చెప్పారన్నారు. తమ కష్టాలు తీరే టైం ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు. 

స్పెషల్ ఆఫీసర్ పాలనతో.. 
రామగుండం మండలంలో ఉన్న కుందనపల్లిని ఇంతకుముందు కొత్తగా ఏర్పడ్డ అంతర్గాం మండలంలో కలిపారు. తర్వాత రామగుండం కార్పొరేషన్​లో విలీనం చేశారు. మళ్లీ డీలిమిటేషన్​లో కార్పొరేషన్​ నుంచి తొలగించారు. గ్రామంలో ఎలక్షన్లు నిర్వహించకుండా స్పెషల్ ఆఫీసర్​పాలనలో నడిపిస్తున్నారు. అప్పటి నుంచి పరిస్థితి మరీ ఘోరంగా మారిందని గ్రామస్థులంటున్నారు. గ్రామపంచాయతీగా ఉన్నప్పుడు పాలకవర్గంతో చర్చించి  ప్రభుత్వానికి చెప్పే అవకాశం ఉండేదని, ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ కు చెప్పినా ప్రయోజనం కనిపించడం లేదంటున్నారు.

అప్పుడు వెయ్యి ఎకరాలు...ఇప్పుడు మూడు వేలు 
యాష్​పాండ్​ను దాదాపు వెయ్యి ఎకరాల్లో స్టార్ట్​ చేయగా ఇప్పుడు 3 వేల ఎకరాలకు విస్తరించింది. ఈ పరిధి రోజు రోజుకూ పెరిగిపోతున్నది. యాష్​పాండ్​ ఏర్పాటు చేసినప్పుడు విలేజ్​కు 300 మీటర్ల దూరంలో ఉండగా ప్రస్తుతం 100 మీటర్ల దూరానికి వచ్చింది. దీంతో ఊరోళ్ల సమస్యల తీవ్రత కూడా పెరిగిపోతున్నది. దీంతో 2004, 2012లో గ్రామస్థులు అప్పటి కలెక్టర్లకు వినతిపత్రాలు ఇచ్చారు. స్మితా సబర్వాల్​కలెక్టర్​గా ఉన్నప్పుడు పీసీబీ డిసిషన్​చెప్పేంత వరకు యాష్​పాండ్​మూసెయ్యాలని ఆదేశాలిచ్చారు. దీంతో కొంత కాలం యాష్​పాండ్​లోకి బూడిద, బురద రావడం ఆగిపోయింది. ఏమైందో ఏమోకానీ కొంత కాలానికే తిరిగి యాష్​పాండ్​ డంపింగ్ షురూ అయ్యింది.