హైదరాబాద్, వెలుగు: వైఎస్సార్ పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ మాజీ ఎంపీ కేవీపీ రాంచందర్ రావు తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ అనగానే వైఎస్ గుర్తొచ్చినందుకు ధన్యవాదాలు అని తెలిపారు. ఈ మేరకు గురువారం పవన్ కల్యాణ్‌కు కేవీపీ లేఖ రాశారు. ‘‘వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు పవన్ కల్యాణ్‌పై ఎలాంటి కేసులు పెట్టలేదు. మీపై కేసులు నమోదు చేయాలని వైఎస్సార్ ఆదేశించారంటూ ఏ పోలీస్ అధికారి అయితే చెప్పారో... ఆ అధికారికి లై డిటెక్టర్ టెస్ట్ నిర్వహించాలి.
ఆ అధికారి చెప్పింది నిజమని తేలితే... నేను తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు లేదా ఏదైనా స్వచ్ఛంద సంస్థకు రూ. 10 కోట్లు విరాళంగా ఇస్తాను. వైఎస్సార్‌కు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. వైఎస్ చనిపోయి 17 ఏండ్లు అవుతున్నా.. ఇంకా ఆయనపై ఆరోపణలు చేయడం అవివేకం” అని కేవీపీ పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలంగా ఉందని కేవీపీ గుర్తు చేశారు.
