ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో విజయం సాధించిన భారత్ మంచి ఊపు మీదుంది. అయితే సీనియర్ పేసర్ ఉమేశ్ యాదవ్‌కు గాయమవ్వడం టీమిండియాను ఆందోళన పరుస్తోంది. ఉమేశ్ ప్లేస్‌లో ఎవరు టీమ్‌లోకి వస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. వన్డే సిరీస్‌లో రాణించిన నటరాజన్‌ను జట్టులోకి తీసుకుంటారా లేదా శార్దూల్ ఠాకూర్‌కు అవకాశం ఇస్తారా అనేది తేలాల్సి ఉంది. నటరాజన్‌తో పోల్చుకుంటే ఎక్కువ రంజీలు ఆడిన అనుభవం ఉన్న శార్దూల్ వైపే టీమ్ మేనేజ్‌మెంట్ మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.
‘నటరాజన్ ఆటతీరు పై అందరూ ఉత్సుకతతో ఉన్నారు. అయితే నటరాజన్ తమిళనాడు తరఫున కేవలం ఒకే ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ ఆడాడనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అదే శార్దూల్ విషయానికి వస్తే అతడు ముంబైకి రెగ్యులర్ రెడ్ బాల్ పేసర్. వెస్టిండీస్‌తో సిరీస్‌లో గాయం కారణంగా ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయకుండానే శార్దూల్ తప్పుకున్నాడు. కానీ అతడి బౌలింగ్ ఇప్పుడు బాగుంది. ఉమేశ్ స్థానాన్ని అతడు భర్తీ చేయొచ్చు’ అని టీమిండియా సన్నిహిత వర్గాలు చెప్పినట్లు సమాచారం.

