రేపిస్టులను కాల్చేసినా తప్పులేదు:  జగన్​

రేపిస్టులను కాల్చేసినా తప్పులేదు:  జగన్​
  • కేసీఆర్, తెలంగాణ పోలీస్​కు హ్యాట్సాఫ్
  • ఏపీ అసెంబ్లీలో దిశ ఘటన ప్రస్తావన..
  • కొత్త చట్టం తెస్తామన్న ఆ రాష్ట్ర సీఎం

అమరావతి, వెలుగు:

ఆడబిడ్డలు ధైర్యంగా ఉండేలా, అత్యాచారాలకు పాల్పడినవారిని 21 రోజుల్లోనే ఉరిశిక్ష వేసేలా చట్టం తెస్తామని ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. మహిళలపై అత్యాచార ఘటనల్లో రెడ్ హ్యండెడ్ గా పట్టుబడితే 3 వారాల్లో శిక్ష విధించేలా చూస్తామని చెప్పారు. బుధవారం అసెంబ్లీలో బిల్లు పెడతామన్నారు. అత్యాచారం, మహిళల కిడ్నాప్లపై విచారించేందుకు జిల్లాకో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేస్తామని తెలిపారు. సోమవారం ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో మహిళల భద్రతపై స్వల్పకాలిక చర్చలో జగన్ మాట్లాడారు.

“హైదరాబాద్‌లో జరిగిన దిశ ఘటనతో నాగరిక సమాజం అంతా సిగ్గుతో తలదించుకోవాలి. ఒక డాక్టర్‌ను టోల్‌ గేట్‌కు సమీపంలో రేప్‌ చేసి, సజీవంగా కాల్చేశారు. ఆ ఇన్సిడెంట్ ను టీవీలల్లో చూసిన తర్వాత  ఆ తల్లిదండ్రుల ఆవేదన, బాధ చూసిన తర్వాత నిందితులను కాల్చేసినా తప్పు లేదని అందరూ అనుకున్నాం. నాకు ఇద్దరు ఆడపిల్లలు. చెల్లెలు, భార్య ఉంది. ఇలాంటి ఘటనలు జరిగితే ఒక తండ్రిగా ఎలా స్పందించాలి? వారికి ఎలాంటి శిక్ష పడితే ఉపశమనం కలుగుతుంది? ఇన్సిడెంట్ జరిగింది. తప్పు జరిగిందని మీడియా గొప్పగా చూపింది. దోషులకు ఏ రకమైన శిక్ష పడితే సరైనదని ప్రజలు భావించారో తెలంగాణ ప్రభుత్వం అదే అమలు చేసింది. సీఎం కేసీఆర్, తెలంగాణ పోలీసులకు హాట్సాఫ్. చట్టసభల సాక్షిగా తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని అభినందిస్తున్నాం. ఇదే సినిమాల్లో హీరో ఏదైనా ఎన్‌కౌంటర్‌ చేస్తే.. అందరం చప్పట్టు కొడతాం. సినిమా బాగుందని చెప్తాం. కానీ నిజజీవితంలో ఒక దమ్మున్నవాళ్లు ఎవరైనా చేస్తే.. జాతీయ మానవహక్కుల సంఘం పేరుతో ఢిల్లీనుంచి వస్తారు. ఇది తప్పట? ఇలా జరక్కూడదంట? ఇలా ఎందుకు చేశారంట? అని నిలదీసిన పరిస్థితులు ఇప్పుడు చూస్తున్నాం. ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో మన చట్టాలు ఉన్నాయి. కొన్ని దేశాల్లో రేపిస్టులను రోడ్డుపై నిలబెట్టి కాల్చేస్తారు. అలాంటప్పుడే  మార్పు వస్తుంది. అడబిడ్డను తప్పుడు దృష్టితో చూడాలంటే భయం కలుగుతుంది. నిర్భయపై అత్యాచారం జరిగి 7  ఏళ్లైనా దోషులకు శిక్ష పడలేదు. న్యాయ వ్యవస్థపై ఎంత నమ్మకం ఉన్నా బాధిత కుటుంబాలను ఆ నమ్మకం ఓదార్చదు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలని ఎవ్వరూ ఆశించరు. కానీ మహిళల విషయంలో తప్పు చేసే వారికి తక్షణం శిక్ష పడేలా కొత్త చట్టం తెస్తాం. అత్యాచారాలు చేసి రెడ్ హ్యాండెడ్ గా దొరికి ఆధారాలుంటే 21 రోజుల్లో మరణ శిక్ష పడుతుందనే భయం ఉంటేనే తప్ప వ్యవస్థలో మార్పు రాదు” అని అన్నారు.

మహిళలపై నేరాలకు లిక్కర్ కారణం

మహిళలపై తప్పుడు పోస్టులతో నిండిన సోషల్‌ మీడియాను చూస్తే బాధగా ఉందని జగన్ అన్నారు. తప్పుడు అకౌంట్లతో మహిళల గురించి ఎవరైనా నెగెటివ్‌ పోస్టులు పెడితే చేస్తే శిక్షలు పడేలా చూస్తామని, కొత్త రూల్స్ తెస్తామని చెప్పారు. మహిళలపై నేరాలకు ప్రధాన కారణం మద్యమేన్నారు. నలుగురితో కూర్చొని మద్యం తాగినప్పుడే మనిషి రాక్షసుడు అవుతాడని తెలిపారు.అందుకే ఏపీలో దశల వారీ మద్య నిషేధాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు.

హెరిటేజ్ లో కిలో ఉల్లి రూ.200

దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో కిలో ఉల్లి రూ.25కే ఇస్తున్నట్లు జగన్ అన్నారు. తెలంగాణలో కిలో ఉల్లి రూ.45 ఇస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 36,500 క్వింటాళ్ల ఉల్లిని రైతుబజార్లలో అమ్మినట్లు తెలిపారు. మాజీ సీఎం చంద్రబాబు హెరిటేజ్‌ దుకాణాల్లో కేజీ ఉల్లి రూ.200కు అమ్ముతూ అసెంబ్లీలో నీతి వ్యాఖ్యలు చెబుతున్నారని విమర్శించారు. ప్రజలపై అంత ప్రేమ ఉంటే హెరిటేజ్ షాపుల్లో ఉల్లిపాయలను కొన్న రేటుకే అమ్మాలని సూచించారు. అంతకు ముందు ఉల్లి రేటు పెరగడంపై టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి ర్యాలీగా వచ్చారు. ఉల్లిదండలు, ప్లకార్డులతో సభలోకి వెళ్తున్న చంద్రబాబు బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు.

Law to hanging rape victims within 21 days: AP CM YS Jagan