హిట్ అండ్ రన్ కాదు పక్కా ప్లాన్ మర్డర్.. హైదరాబాద్ లో అడ్వకేట్ దారుణ హత్య

హిట్ అండ్ రన్ కాదు పక్కా ప్లాన్ మర్డర్.. హైదరాబాద్ లో  అడ్వకేట్ దారుణ హత్య

 హైదరాబాద్ మాసబ్ ట్యాంక్‌లో కలకలం రేపిన కారు దాడిలో తీవ్రంగా గాయపడిన ప్రముఖ న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్ కన్నుమూశారు. ఆసుపత్రిలో  ప్రాణాలతో పోరాడుతున్న ఆయన.. చికిత్స పొందుతూ ఈరోజే తుది శ్వాస విడిచారు.

 అసలు ఏం జరిగిందంటే..?

మే 23వ తేదీ ఉదయం ఖాజా మొయిజుద్దీన్ తన ఇంటి నుంచి బయటకు రాగానే.. అప్పటికే మాటు వేసిన దుండగులు ఆయనపైకి కారుతో డీ కొట్టారు.  ఆయన ప్రాణాలను ప్రమాదంలో పడేసి అక్కడి నుంచి పరారయ్యారు.  మొదట దీనిని ఒక సాధారణ హిట్ అండ్ రన్ కేసుగా భావించినప్పటికీ.. అడ్వకేట్ మృతి చెందడంతో రంగంలోకి దిగిన పోలీసులు దీన్ని పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్య కేసుగా మార్చి విచారణ జరుపుతున్నారు.

 హత్య వెనుక ఉన్న వివాదాలు ?

అయితే ఈ హత్య వెనుక భారీ భూవివాదాలు ఉన్నట్లు తెలుస్తోంది. వక్ఫ్ ఆస్తులు, భూమి వ్యవహారాలకు సంబంధించి ముజాహిద్ ఆలం ఖాన్, మహబూబ్ ఆలం ఖాన్‌లతో న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్‌కు గత కొంతకాలంగా తీవ్ర వివాదాలు నడుస్తున్నాయి. గతంలో కూడా ఈ ఇద్దరు నిందితులు న్యాయవాదికి హాని తలపెట్టడానికి ప్రయత్నించారని.. దీనిపై ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు కూడా నమోదయ్యాయని బాధితుడి కుటుంబ సభ్యులు, సహచర న్యాయవాదులు ఆరోపిస్తున్నారు.  ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి.. నిందితుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.