విద్యాసంస్థలకు మరో 3 రోజులు సెలవులు

విద్యాసంస్థలకు మరో 3 రోజులు సెలవులు

రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న  నేపథ్యంలో విద్యా సంస్థలకు ప్రకటించిన సెలవులను తెలంగాణ సర్కారు శనివారం (జులై 16) వరకు పొడిగించింది. వచ్చే సోమవారం నుంచి బడులు తిరిగి ప్రారంభం కానున్నాయి. రాబోయే మూడు రోజులు కూడా వర్షాలు కొనసాగొచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు్ తెలుస్తోంది. అంతకుముందు సోమవారం నుంచి బుధవారం వరకు సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. వర్షాల కారణంగా రేపు, ఎల్లుండి జరగాల్సిన ఎంసెట్ (అగ్రికల్చర్ స్ట్రీమ్) పరీక్షలు కూడా వాయిదా వేశారు. వాయిదా పడిన పరీక్షల తేదీలను త్వరలో ఖరారు చేయనున్నారు. ఈ నెల 18,19 20 తేదీల్లో  జరగాల్సిన ఇంజనీరింగ్‌ విభాగం ఎంసెట్‌ పరీక్షలు మాత్రం యథావిధిగా జరగనున్నాయి. 

భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు జేఎన్టీయూ సెలవులు పొడగించింది. ఈ నెల 14 నుంచి 16 వరకు జేఎన్టీయూ పరిధిలోని అన్ని కాలేజీలు మూసివేయాలని ఆదేశించింది. 18వ తేదీ నుంచి క్లాసులు యధావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. మరోవైపు ఇంటర్ బోర్డు సైతం మరో 3 రోజులు సెలవులు పొడగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. 

వర్షాల కారణంగా శాతవాహన యూనివర్సిటీ పరిధిలో రేపటి నుంచి జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. వాయిదా పడ్డ పరీక్షల నిర్వహణ తేదీలను త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు.