తేజ శ్రీ చదువుల్లో టాపర్.. ఆటల్లో నంబర్‌వన్.. సోషల్ యాక్టివిస్ట్ కూడా.. సేవలోనూ ముందుంటుంది. ఈ కరోనా కష్టకాలంలో ఎంతోమందికి సాయం చేస్తోంది. పేదవాళ్లకు మూడపూట్ల తిండి పెడుతుంది. ఈ సాయం చేసే గుణం నాన్న నుంచే వచ్చింది. వీలైనంత ఎక్కువమందికి సాయం చేయడమే నా లక్ష్యం అంటోంది.
మా సొంతూరు వికారాబాద్ జిల్లాలోని పూడూరు. నా చదువంతా అక్కడే సాగింది. చదువుతో పాటు, స్పోర్ట్స్‌లోనూ ముందుండేదాన్ని. నేషనల్ లెవల్లో కూడా చాలా పతకాలు గెలిచా. హైదరాబాద్ నైపర్‌లో ఫార్మా ఎంబీఏ పూర్తిచేసి ఒక కంపెనీలో ఉద్యోగంలో చేరా. స్కూలు, కాలేజీలో చదువుతున్నప్పుడే ఎన్జీవోలతో కలిసి పనిచేశా. స్లమ్స్‌లోని పిల్లలకు క్లాసులు చెప్పేదాన్ని. వాళ్లు ఉంటున్న ఏరియాల్లో ఫ్యాక్టరీల నుంచి వస్తున్న కెమికల్స్ వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారో అర్థమైంది. కెమికల్ ఫ్రీ ప్రపంచంలో ఉండాలనే ఉద్దేశంతో ఫార్మా ఫీల్డ్ వదిలేశా. పదిమందికి సాయం చేయాలకుని ముందుకు వెళ్తున్నా. ఇప్పుడు ఎల్ఎల్ఎమ్ చదువుతున్నా.
ఇంటి నుంచి అలవాటు..
నాన్న వెంకటరెడ్డి రైతు. చాలా కష్టపడి మమ్మల్ని చదివించాడు. ఎవరైనా కష్టం అని ఇంటికొస్తే ఎంతో కొంత ఇచ్చి పంపేవాళ్లు. అలా ఆయన నుంచి నాకు అలవాటైందే హెల్పింగ్ నేచర్. కాలేజీలో చేరిన తర్వాత ‘యూత్ ఫర్ సేవ’, ‘సేవా భారతి’ లాంటి ఎన్జీవోలతో కలిసి పనిచేశా. పొద్దున గ్రౌండ్‌కు వెళ్లి.. అక్కడ నుంచి కాలేజీకి.. అదయ్యాక స్లమ్స్‌లో పిల్లలకు పాఠాలు చెప్పేందుకు వెళ్లేదాన్ని. ప్యాండెమిక్ వల్ల ఇబ్బందులు పడుతున్న కూలీలను చూసి మనసు చలించి పోయింది. వాళ్లకోసం ఏదైనా చేయాలనిపించింది. ఫండ్స్ రైజ్ చేసి హాస్పిటల్స్, హోం ఐసోలేషన్‌లో ఉన్న 10 వేల మందికి ఫుడ్ అందించా. బసవతారకం, నిమ్స్ తదితర హాస్పిటల్స్‌లో పేషెంట్లకు ఇమ్యూనిటీ బూస్టింగ్ ఫ్రూట్స్ లాంటివి అందించాం. ప్రైవేట్ స్కూల్ టీచర్లకు, వలస కూలీలకు సరుకులిచ్చాం. భోజనం పెట్టాం.
‘యువర్ సిస్టర్స్’
ఈ మధ్యే ‘యువర్ సిస్టర్స్’ పేరుతో ఒక గ్రూప్ మొదలుపెట్టాం. దాని ద్వారా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు హెల్ప్ చేస్తున్నాం. చాలామందికి ఫ్రీ లీగల్ ఎయిడ్ కూడా ఇచ్చాం. తమ కష్టాలు, బాధలు, డిప్రెషన్ ఎవరికి చెప్పుకోవాలో తెలీక చాలామంది ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వాళ్లకు మా గ్రూప్ నుంచి సాయం చేస్తున్నాం. కొంతమంది మహిళలు తమ కాళ్లపైన నిలబడేందుకు హెల్ప్ చేశాం. కుట్టుమిషన్ల లాంటివి అందించాం. ఆపదలో ఉన్నవాళ్లకి నా పరిధిలో ఏదో ఒక సాయం చేయాలనేదే నా లక్ష్యం.
కెమికల్ ఫ్రీ ఫుడ్డే లక్ష్యం..
బీ ఫార్మసీ చేసేటప్పుడే కెమికల్స్ వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ అర్థమయ్యాయి. కెమికల్స్‌కు దూరంగా ఉండాలనుకుని ఆ ఫీల్డ్ వదిలేశా. అప్పుడు చాలామంది ‘పిచ్చి పని చేస్తున్నావు. డబ్బులు ఎక్కడ నుంచి వస్తాయి. ఉద్యోగం మానకు’ అని చెప్పారు. కానీ, ఆ టైంలో నాన్న నాకు సపోర్ట్‌గా ఉన్నారు. అప్పుడే ఫ్రెండ్స్‌తో కలిసి ‘కావ్య నేచురల్స్’ అనే ఒక సంస్థను స్టార్ట్ చేశా. దాని నుంచి పూర్తిగా కెమికల్ ఫ్రీ ఫుడ్ ఇస్తున్నాం. ఊళ్లు తిరిగి రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. ఆర్గానిక్ ఫామింగ్ చేస్తున్న రైతుల దగ్గర నుంచి నేరుగా పంట కొనుగోలు చేస్తున్నాం. మాతో పాటు పనిచేసే రైతులకు ఇన్సూరెన్స్, వాళ్ల పిల్లల చదువులకు సాయం చేయాలనేది నా లక్ష్యం. ఎందుకంటే రైతు కష్టమేంటో నాకు తెలుసు. వాళ్లు పడే ఇబ్బందులు కళ్లారా చూశా. కరోనా టైంలో పేషెంట్లకు పంచిన ఫ్రూట్స్ కూడా ఆర్గానిక్‌గా పండించినవే. పైగా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్లో ప్లాస్టిక్‌ను అస్సలు వాడలేదు. పర్యావరణంపై ఉన్న ప్రేమతో ఎన్విరాన్మెంటలిస్ట్ పురుషోత్తమరెడ్డితో కలిసి పనిచేస్తున్నా అంటోంది తేజ శ్రీ.
::: తేజ తిమ్మిశెట్టి