- కూలిన చివరి కోట.. కేరళ
- 1920లలో మొదలైన కమ్యూనిస్టు ఉద్యమం..
- 1964లో సీపీఎం, సీపీఐ విభజన
న్యూఢిల్లీ: కేరళలో లెఫ్ట్ కూటమి ఓటమితో భారత రాజకీయ చరిత్రలో ఒక పెద్ద అధ్యాయం ముగిసింది. 49 ఏండ్ల తర్వాత దేశంలో ఏ రాష్ట్రంలోనూ కమ్యూనిస్టు ప్రభుత్వం అధికారంలో లేని పరిస్థితి ఏర్పడింది. కేరళ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్ష ప్రజాస్వామ్య కూటమి(ఎల్‌డీఎఫ్) ఓడిపోయింది. ఇది ఒక ఎన్నికల ఓటమి మాత్రమే కాదు.. వామపక్ష రాజకీయాల పతనానికి చిహ్నంగా మారింది. భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమం 1920లలో మొదలైంది. 1925లో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) అధికారికంగా స్థాపించారు. రష్యా బోల్షెవిక్ విప్లవం స్ఫూర్తితో ఆవిర్భవించిన ఈ పార్టీ, స్వాతంత్ర్య పోరాటంలో క్రియాశీలకంగా పాల్గొంది. స్వాతంత్ర్యం తర్వాత పార్టీలో చీలికలు వచ్చాయి. చైనా, సోవియట్ యూనియన్‌లతో సంబంధాలపై భిన్నాభిప్రాయాలతో 1964లో సీపీఐ(మార్క్సిస్ట్) విడిపోయింది. అయినా రెండు పార్టీలూ కేరళ, బెంగాల్, త్రిపుర రాష్ట్రాల్లో బలంగా పాతుకుపోయాయి.
వామపక్షాలకు స్వర్ణయుగం
కేరళ: 1957లో ఈఎంఎస్ నంబూద్రిపాద్ నేతృత్వంలో ప్రపంచంలోనే మొదటిసారిగా ప్రజాస్వామ్య బద్ధంగా కమ్యూనిస్టు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దశాబ్దాలపాటు కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌తో అధికార మార్పిడి జరిగింది. 2016లో తిరిగి అధికారంలోకి వచ్చిన ఎల్‌డీఎఫ్, 2021లో అసాధారణంగా మరోసారి గెలిచింది. 2026లో మూడోసారి గెలవాలని ప్రయత్నించి విఫలమైంది.
బెంగాల్: 1977 నుండి 2011 వరకు వరుసగా 34 సంవత్సరాలు వామపక్ష ప్రభుత్వం పాలించింది. భూ సంస్కరణలు, పంచాయతీ వ్యవస్థ బలోపేతం ముఖ్యమైన విజయాలు. అయితే సింగూర్, నందిగ్రామ్ వివాదాలు వారికి చేటు చేశాయి. 2011లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ వారిని గద్దె దించింది.
త్రిపుర: 25 సంవత్సరాలకు పైగా కొనసాగిన వామపక్ష పాలనను 2018లో బీజేపీ కూల్చేసింది.
వామపక్షాలు ఎందుకు వెనకబడ్డాయి?
ప్రపంచం చాలా మారిపోయింది. చైనా, వియత్నాం సైతం మార్కెట్ రిఫామ్స్ చేపట్టాయి. కానీ భారత వామపక్షాలు మాత్రం 1920 నాటి భావాలనే పట్టుకొని ఉన్నాయి. కొత్త తరాన్ని ఆ భాష, నినాదాలు ఆకట్టుకోలేదు. ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ను వ్యతిరేకించడం వల్ల కొత్త తరం ఓటర్లు దూరమయ్యారు. వర్గ వివాదాలు, వృద్ధ నాయకత్వం, కొత్తతరం నాయకత్వ లేమి వామపక్షాలను బలహీనపరిచాయి.
పదేళ్ల పాలనతో ప్రజల్లో వ్యతిరేకత
కేరళను వామపక్షాల ఆదర్శ రాష్ట్రంగా చెప్పుకునేవారు. మానవ అభివృద్ధి సూచికల్లో దేశంలోనే అగ్రస్థానం. విజయన్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు, విద్య, వైద్యంలో మంచి పని చేసింది. కానీ పదేళ్ల పాలనలో అలసట ప్రజలకు కలిగింది. నిరుద్యోగం పెరిగింది. పాలనలో నిర్లక్ష్యం
అనే విమర్శలు వచ్చాయి. ఫలితంగా ప్రజలు మార్పు కోసం ఓటు వేశారు. కేరళ చేజారడంతో భారత్‌లో వామపక్ష పాలన పూర్తిగా అంతమైంది.
భవితవ్యం ఏంటి?
దేశంలో కమ్యూనిజం పతనం ఒక్కరోజులో జరగలేదు. దశాబ్దాలు నెమ్మదిగా చోటుచేసుకుంది. 2011లో పశ్చిమ బెంగాల్ కోల్పోయింది. 2018లో త్రిపురలో పతనమైంది. ప్రస్తుతం కేరళ చేజారింది. ఇలా ఒక్కొక్క కోట కూలిపోతూ.. ఇప్పుడు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. అధికారం లేకుండా విధాన పరమైన ప్రయోగాలు చేయడం కష్టం. అయితే అసమానతలు, లౌకికవాదం వంటి వామపక్ష భావాలకు సమాజంలో ఇంకా ఆదరణ ఉంది. అన్ని పార్టీలు ప్రత్యక్షంగానో పరోక్షంగా అనుసరిస్తున్న సంక్షేమ పాలన, విధానాలు వామపక్ష ప్రభావమే. మనుగడ కోసం లెఫ్ట్పార్టీలు అలయన్స్ రాజకీయాలు, ఐడియాలజీ పునరుద్ధరణ, ఉద్యమ రాజకీయాలపై దృష్టి పెట్టాల్సి ఉంది. స్థానిక సంస్థల్లో, ట్రేడ్ యూనియన్లలో వారి ప్రభావం కొనసాగుతుండడం
సానుకూలాంశం.
