సెలూన్ లోకి వచ్చిన చిరుత

సెలూన్ లోకి వచ్చిన చిరుత

హర్యానా: గురుగ్రామ్ లోని బద్షాపూర్ అనే గ్రామంలో  ఓ చిరుత గ్రామంలోకి ప్రవేశించి స్థానికులను భయబ్రాంతులకు గురి చేసింది. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఓ చిరుతపులి  గ్రామంలోని ఓ ఇంటిలోకి చొరబడింది.  ఒక్క సారిగా పులిని చూడడంతో ఆ ఇంట్లో వారంతా భయంతో బయటకు పరుగులు తీశారు. సుమారు గంటపాటు ఆ ఇంటిలో ఉన్న చిరుత సాయంత్రం 4 గంటల సమయంలో సమీపంలో ఉన్న ఓ సెలూన్ లోకి దూరింది. అయితే అప్పటికే ఆ ప్రాంతంలో చిరుత వచ్చిందనే కలకలం రేగడంతో.. చిరుత రాకను ముందే గమనించిన ఆ సెలూన్ షాప్ యజమాని తెలివిగా ఆ చిరుత షాప్ లోకి దూరగానే బయట నుంచి షట్టర్ మూసేశాడు.

స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు, అటవీ శాఖ అధికారులకు తెలియజేయడంతో అధికారులు ఆ ప్రాంతానికి చేరుకొని, వల పన్ని ఆ చిరుతను  బంధించారు. హర్యానా ఫారెస్ట్ ఆఫీసర్ ఈ విషయంపై మాట్లాడుతూ.. సెలూన్ షాప్ దగ్గర చిరుతను  వల పన్ని పట్టుకున్నామని, ఆ షాప్ లో ఉన్న అద్దాలు గుచ్చుకొని దాని ముఖమ్మీద గాయాలయ్యాయని, దాని వయస్సు 2 నుంచి 5 ఏళ్ల మధ్యలో ఉంటుందని తెలిపారు. ఎలాంటి గందరగోళం లేకుండా తమ సిబ్బంది చాకచక్యంగా ఆ చిరుతను బంధించారని తెలిపాడు.  చిరుతను బంధించే క్రమంలో ఇద్దరు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయని ఆయన చెప్పాడు.