వివిధ కుల సంఘాలకు జాతీయ బీసీ కమిషన్‌ లెటర్‌‌

వివిధ కుల సంఘాలకు జాతీయ బీసీ కమిషన్‌ లెటర్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు: ఓబీసీ జాబితాలో కులాలను చేర్చడంపై వివిధ బీసీ కులాల ప్రతినిధులు, సంఘాలు ఢిల్లీలో విచారణకు హాజరవ్వాలని జాతీయ బీసీ కమిషన్‌‌ సూచించింది. ఈ మేరకు సీఎస్‌‌కు, బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్‌‌ సెక్రటరీ, వివిధ కుల సంఘాల ప్రతినిధులు, సంఘాలకు శనివారం లేఖ రాసింది. రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని కులాలను బీసీ జాబితాలో చేర్చాయని, వాటిని ఓబీసీల్లోకి మార్చాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపాయని తెలిపారు. దీనిపై ఢిల్లీలో విచారణ జరపనున్నట్లు లెటర్‌‌లో కమిషన్ పేర్కొంది. రాష్ట్రాల ప్రపోజల్స్‌‌పై, బీసీ కులాల ఎంపిక విధానంపై పూర్తిస్థాయిలో పరిశీలించి.. కేంద్ర సామాజిక న్యాయశాఖకు రిపోర్ట్‌‌ ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో విచారణకు ఆయా కులాల ప్రతినిధులు, కుల సంఘాలు హాజరై, వారి జీవన విధానాలు, స్థితిగతులను ఆధారాలతో సమర్పించాలని కోరింది. తెలంగాణ ప్రభుత్వం కూడా పూర్తి వివరాలను ఈనెల 21వ తేదీలోపు మెయిల్‌‌ ద్వారా పంపించాలని సూచించింది.

ఏయే తేదీల్లో ఏయే కులాలు..

ఈ నెల 22న ఉదయం 10 గంటలకు బుక్క అయ్యవార్లు, గోత్రాల, బొదిలి, ఆరె మరాఠి, ఆరె, ఆఘాముడియార్‌‌, సుంది, వర్ల, సిస్ట కరణం, వీరశైవ లింగాయత్‌‌, అచ్చకుట్లవాండ్లు హాజరుకావాలని కమిషన్‌‌ సూచించింది. 23న అద్దపువారు, బాగోతుల, బైల్‌‌ కమ్మర, యేనేటివాళ్లు, గంజికూటి, గౌడ జెట్టి, కాకిపడగల, పటంవారు, ఓడ్‌‌, సన్నాయిలు, శ్రీక్షత్రీయ రామజోగి, బైకాని, తోలు బొమ్మలవారు, అచీర్‌‌ యాదవ్‌‌, గౌలి, కుల్ల కడగి వాళ్లు అటెండ్‌‌ కావాలని పేర్కొంది. 24న అత్తర్‌‌సాయిబులు, ధోబీ ముస్లిం, గరాడీ సాయిబులు, గారడోళ్లు, గోసంగి ముస్లిం, పకీర్‌‌ సాయేబు, గుడ్డి ఎలుగువాళ్లు, నాయీముస్లిం తదితర కులాలు కమిషన్‌‌ ఎదుట హాజరుకావాలని లెటర్‌‌‌‌లో పేర్కొంది.  ఇతర వివరాలకు కమిషన్‌‌ మెంబర్‌‌ ఏకే సింగ్‌‌ 98681 00521, రీసెర్చ్‌‌ ఆఫీసర్‌‌ గుల్షన్‌‌ 81300 34340 నంబర్లలో సంప్రదించాలని తెలిపింది.