ఇది లిఫ్ట్​బాయ్​ ఫ్యాషన్​ ప్రపంచం     

ఇది లిఫ్ట్​బాయ్​ ఫ్యాషన్​ ప్రపంచం     

ఖరీదైన దుస్తులు, కళ్ళద్దాలు, వాచ్​లు, షూస్, హ్యాండ్​ బ్యాగులు అనగానే ఠక్కున గుర్తొచ్చే పేరు గూచీ. ఈ బ్రాండ్​తో మార్కెట్​లోకి విడుదలయ్యే వస్తువుల ధర లక్షల నుంచి కోట్ల వరకు పలుకుతుంది. కుబేరులు, ప్రముఖులు, వ్యాపారవేత్తలు, సినిమా తారలు, రాజకీయ నాయకులు గూచీ బ్రాండ్​ అంటే చాలు కళ్లు మూసుకొని కొంటారు. ఈ బ్రాండ్​ను​ స్టేటస్​ సింబల్​గా భావిస్తారు. ఇంతటి పేరు సంపాదించిన బ్రాండ్ సృష్టికర్త పేరు గూచియో గూచీ.  

ఫ్యాషన్​ ఇండస్ట్రీలకు కేరాఫ్​ అడ్రస్​ ఇటలీ. ఇక్కడి  టస్కనీ ప్రాంతంలోని ఫ్లోరెన్స్​ సిటీలో 1881లో పుట్టాడు గూచీ. పూర్తి పేరు గూచియో గియోవాన్​బటిస్టా గియాసింటో డేరియో మారియా గూచీ. బతుకు పోరాటంలో భాగంగా మొదట పారిస్​కు వెళ్లాడు. అక్కడి నుంచి1897లో లండన్​కు వెళ్లి ప్రఖ్యాత హోటల్ ​స్వాంకీ సవాయ్​​లో లిఫ్ట్​బాయ్​గా చేరాడు. ఇక్కడికి మార్లిన్​ మన్రో, విన్​స్టన్​ చర్చిల్​ లాంటి ప్రముఖులతోపాటు అనేక మంది ధనికులు వస్తుండేవారు. వాళ్లకు గదులు చూపించడం, వాళ్ల బ్యాగులు, సూట్​కేసులు మోయడం వంటి పనులు గూచీ చేసేవాడు. ఆ క్రమంలో గెస్ట్​లు వాడుతున్న దుస్తులు, బ్యాగుల వంటి వాటిని బాగా గమనించేవాడు. వాటి నాణ్యత, తయారీకి వాడే బట్ట, ప్రయాణాలకు ఉపయోగపడుతున్న తీరు వంటివి దగ్గరగా పరిశీలించేవాడు. ఆ తర్వాత కొన్నేళ్లపాటు యూరోపియన్​ రైలు​ కంపెనీ ‘డెస్​ వేగన్స్​‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లిట్స్’లోనూ గూచీ పనిచేశాడు. ఈ రెండింటిలో పనిచేస్తుండగా ఫ్యాషన్​పై ఆసక్తి పెంచుకున్నాడు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత స్వదేశానికి  చేరుకొని, లెదర్​ బ్యాగులు తయారుచేసే ఫ్రాంజి కంపెనీలో పనిచేశాడు. ఇక్కడే లెదర్​ దుస్తుల తయారీపై పూర్తి పట్టు సాధించాడు. 

  • పునాది పడింది1921లో​...

గూచీ బ్రాండ్​కు తొలి పునాది 1921లో పడింది. ఫ్లోరెన్స్​ నగరంలోనే ఓ లెదర్​ వస్తువుల తయారీ షాపును కొన్నాడు గూచీ. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న లెదర్​ వస్తువులను అమ్మేవాడు. దీంతోపాటు స్థానికంగా ఉండే కొంత మంది పనివాళ్లతో కలసి ఓ వర్క్​షాప్​ను కూడా ప్రారంభించాడు. ఆ తర్వాత దాదాపు 60 మంది పనివాళ్లతో కలసి మరో దుకాణం ఏర్పాటుచేశాడు. అయితే, 1935లో ముస్సోలినీ నేతృత్వంలోని ఇటలీ.. ఆఫ్రికాలోని ఇథియోపియో ఆక్రమణకు ప్రయత్నించింది. దీంతో యూరప్​ వాణిజ్య సంఘం ఇటలీపై ఆంక్షలు విధించింది. దాంతో లెదర్​ దొరకడం కష్టమైంది. దానికి బదులు  జనపనార, చెక్క, లెనిన్​ వంటి వాటితో బ్యాగులు తయారుచేయడం మొదలుపెట్టాడు. ఇలా గూచీ ట్రేడ్​మార్క్​ అయిపోయింది. ఆ పద్ధతిలో 1937లో లెదర్​ బ్యాగులు మార్కెట్​లోకి తెచ్చాడు. గూచీ భార్య, పిల్లలు కూడా కంపెనీలో పనిచేసేవారు. ముఖ్యంగా పెద్ద కొడుకు అల్డో తమ కంపెనీ ఎదుగుదలలో తండ్రికి 1925 నుంచే చేదోడువాదోడుగా నిలిచాడు. అల్డో సలహాతోనే 1938లో రోమ్​లో కంపెనీ కొత్త షాపు ప్రారంభించింది. అలాగే లెదర్​ బ్యాగులతోపాటు గ్లోవ్స్, వాలెట్స్​, కీ చైన్స్​ వంటి వాటిని తయారుచేయడం మొదలైంది. రెండో ప్రపంచయుద్ధంలో ఇటలీ సైనికుల కోసం గూచీ కంపెనీ ప్రత్యేక బూట్లను తయారుచేసింది.1947లో తన ముగ్గురు కొడుకులకు (అల్డో, వాస్కో, రొడాల్ఫో) కంపెనీలో వాటాలు పంచాడు. అదే ఏడాది వెదురుతో తయారుచేసిన బ్యాగులను తొలిసారి మార్కెట్లోకి తెచ్చాడు. 1953 జనవరి 2న మిలాన్​లో గూచీ మరణించాడు. అదే ఏడాది గూచీ బ్రాండ్​ అమెరికాలోని న్యూయార్క్​లో వేరే దేశంలో గూచీ షాపు పెట్టడం ఇదే మొదటిసారి. తరువాత క్రమక్రమంగా అన్ని దేశాలకూ విస్తరించింది. కుటుంబ కలహాల కారణంగా1980 నుంచి కంపెనీకి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. చివరికి 2004లో కెరింగ్​ గ్రూప్​కు కంపెనీలో సగానికి పైగా వాటా అమ్మేసింది. అయితే, ఇప్పటికీ ఇక్కడ తయారయ్యే హ్యాండ్​బ్యాగులు, కాస్మొటిక్స్​, షూస్, బెల్ట్​ వంటి ప్రొడక్ట్స్ తయారీ, నాణ్యత, మార్కెటింగ్​ వంటి వాటిని చూసుకునేది గూచీ కుటుంబమే. 

లెదర్​ బ్యాగులతో మొదలై.

గూచీని స్థాపించింది ఫ్యాషన్​ ఇండస్ట్రీకి చిరునామా అయిన ఇటలీలో. అయితే ఆ కంపెనీలో తయారయ్యే వస్తువుల డిజైన్లు, స్టైల్స్​కు ప్రేరణ ఇంగ్లండ్​ ప్రజలే. గూచీ మొదట తయారుచేసింది లెదర్​ బ్యాగులు, బ్రీఫ్​కేసులు మాత్రమే. వీటికి ఇప్పటికీ మార్కెట్​లో ఎంతో ఆదరణ ఉంది. కంపెనీ లోగో రెండు ఇంగ్లీష్​​ ‘జి’ అక్షరాలు గూచియో గూచీని సూచిస్తాయి. ఈ లోగోను 1960లో డిజైన్​ చేశారు. గూచీకి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది సెలబ్రిటీలు అభిమానులు. అమెరికా ఫేమస్​ ర్యాపర్​ ‘టు చైంజ్​’ తాను మరణించాక తన పార్థివ దేహాన్ని ఏదైనా గూచీ స్టోర్​లో ఖననం చేయమని కోరాడు. ప్రముఖ హాలీవుడ్​ నటి ఎలిజబెత్​ టేలర్​ కూడా గూచీ ప్రొడక్ట్స్​కు వీరాభిమాని. ఆమె ఉపయోగించే గూచీ హోబో బ్యాగ్​ ఎంతో ఖరీదైంది. మొనాకో రాణి గ్రేస్​ కెల్లీ స్కార్ఫ్​లపై పూలతీగల డిజైన్లు కావాలని అడిగింది. వెంటనే ఆమెకు తయారుచేసి పంపించారు. గూచీ కంపెనీకి 1994లో టామ్​ ఫోర్డ్​ క్రియేటివ్ డైరెక్టర్​గా వచ్చాక ఐదేండ్లలో సంస్థ ఉత్పత్తుల అమ్మకాల్లో 90 శాతం పెరుగుదల కనిపించింది. 1998లో సంస్థ రూపొందించిన ‘జీనియస్​ జీన్స్​’ అత్యధిక ధర పలికిన జీన్స్​గా గిన్నిస్​ రికార్డుకు ఎక్కింది. దీని ధర అప్పట్లో 3,134 (రూ.1,31,628) డాలర్లు.     స్టెల్లా మెక్​కార్ట్​నీ, అలెగ్జాండర్​ మెక్​క్వీన్​ లాంటి ఎంతో మంది ప్రముఖ డిజైనర్లు గూచీలో పనిచేశారు. పేదదేశాల్లోని చిన్నారులకు మంచినీరు, చదువు అందించేందుకు వీలుగా 2005లో యునిసెఫ్​తో గూచీ ఒప్పందం కుదుర్చుకుంది. సంస్థ ఉత్పత్తుల లాభాల్లో కొంత మొత్తాన్ని దీనికోసం కేటాయించింది. 
.