అగరుబత్తీలపై జీఎస్టీ వేసిన చరిత్ర బీజేపీది : మంత్రి సీతక్క

అగరుబత్తీలపై జీఎస్టీ వేసిన చరిత్ర బీజేపీది : మంత్రి సీతక్క

ములుగు, వెలుగు : హిందువుల పార్టీగా చెప్పుకునే బీజేపీది అగరుబత్తీలపై జీఎస్టీ వేసిన చరిత్ర అని రాష్ర్ట పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖా మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ములుగులోని లీలా గార్డెన్​లో కాంగ్రెస్​ నియోజకవర్గ స్థాయి విస్తృతస్థాయి సమావేశం జరిగింది. దీనికి ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్​తోపాటు మంత్రి సీతక్క ముఖ్య​అతిథులుగా హాజరయ్యారు. సీతక్క మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలోకి రాలేమని గ్రహించిన బీజేపీ ప్రతిపక్ష నాయకులపై కేసులు పెడుతూ జైలులో పెడుతోందన్నారు. 

జీఎస్టీ తీసుకువచ్చి పేద, మధ్యతరగతి వర్గాల నుంచి రూ.54 లక్షల కోట్లు వసూలు చేశారని విమర్శించారు. ప్రతి ఏడాది ఇస్తామన్న 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేదని, జన్​ధన్​ఖాతాల్లో రూ.15 లక్షలు ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. ఎన్నికల్లో మహబూబాబాద్​ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్​ ను గెలిపించుకునేందుకు కృషి చేయాలన్నారు. మహిళలకు వడ్డీలేని రుణాలతోపాటు రూ.10లక్షల ఉచిత జీవిత బీమా ఇస్తామన్నారు. అనంతరం జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన బీఆర్ఎస్ లీడర్లు పార్టీ చేరారు. కాంగ్రెస్​ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్, డాక్టర్ అనిల్ పాల్గొన్నారు. 

గడ్డపార పట్టి మట్టి తవ్వి...

వెంకటాపూర్​(రామప్ప) : ములుగు, బండారుపల్లితోపాటు వెంకటాపూర్ ​మండలంలోని నర్సాపూర్, కేశవాపూర్ ​గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలతో మంత్రి సీతక్క మాట్లాడారు. ఈ సందర్భంగా గడ్డపారతో మట్టి తవ్వారు. సీతక్క మాట్లాడుతూ ఈసారి రాహుల్​ గాంధీ ప్రధాని కావడం ఖాయమన్నారు.