లింగంపల్లి రైల్వేస్టేషన్ లో చిన్నారిని కిడ్నాప్ చేసిన ముఠా అరెస్ట్.. పిల్లలు లేని వారికి విక్రయం

లింగంపల్లి రైల్వేస్టేషన్ లో  చిన్నారిని కిడ్నాప్ చేసిన ముఠా అరెస్ట్.. పిల్లలు లేని వారికి విక్రయం
  • పాపను తల్లిదండ్రులకు అప్పగించిన సైబరాబాద్​ సీపీ రమేశ్​

గచ్చిబౌలి, వెలుగు: పిల్లలు లేని వారికి అక్రమంగా విక్రయించేందుకు లింగంపల్లి రైల్వే స్టేషన్ ఫుట్‌‌పాత్‌‌పై నిద్రిస్తున్న మూడేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసిన ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌‌ లోని గుంతకల్లుకు చెందిన బి. గోవిందమ్మ బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి, లింగంపల్లి రైల్వే స్టేషన్ వద్ద వీధి వ్యాపారం చేస్తోంది. 

ఈ నెల 16న తెల్లవారుజామున ఆమె కుమార్తె కిడ్నాప్‌‌నకు గురైంది. తల్లి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన చందానగర్, నార్సింగి, సీసీఎస్ పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. నిందితులు ఆటోలో శంషాబాద్ హైవే మీదుగా మహబూబ్‌‌నగర్ వైపు వెళ్లినట్లు గుర్తించి, జడ్చర్ల వద్ద ఒక నిందితుడిని పట్టుకున్నారు. 

అతడు ఇచ్చిన సమాచారంతో మహబూబ్‌‌నగర్ ప్రభుత్వ దవాఖాన వద్ద చిన్నారిని రూ.1.50 లక్షలకు విక్రయించేందుకు సిద్ధమైన నవనీత(స్టాఫ్ నర్స్, మహబూబ్​నగర్​జిల్లా కేంద్రంలోని న్యూ ప్రేమ్​నగర్​వాసి), ఆటో డ్రైవర్ రామకృష్ణ(బండ్లగూడ కాళీమందిర్ వాసి), పెయింటర్ శ్రీనివాస్‌‌(వికారాబాద్​ జిల్లా పరిగి)లను అరెస్ట్ చేశారు. సైబరాబాద్ సీపీ రమేశ్ శనివారం కమిషనరేట్​ఆఫీస్​లో పాపను తల్లిదండ్రులకు అప్పగించారు.