లింక్డ్‌ఇన్ లో లేఆఫ్స్: 900 మందిని ఇళ్లకు పంపిస్తున్న కంపెనీ.. ఎందుకీ నిర్ణయం?

లింక్డ్‌ఇన్ లో లేఆఫ్స్: 900 మందిని ఇళ్లకు పంపిస్తున్న కంపెనీ.. ఎందుకీ నిర్ణయం?

టెక్ రంగంలో లేఆఫ్స్ పరంపర కొనసాగుతూనే ఉంది. సిస్కో 4వేల మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించిన తర్వాత ప్రపంచ ప్రసిద్ధ ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫారమ్ లింక్డ్‌ఇన్ కూడా 5 శాతం మంది ఉద్యోగులను ఇంటికి పంపేందుకు సిద్ధమైంది. మైక్రోసాఫ్ట్ యాజమాన్యంలోని ఈ సంస్థ.. సుమారు 900 మంది ఉద్యోగులపై వేటు వేయనుంది. మే 14, 2026న విడుదలైన రిపోర్ట్స్ ప్రకారం.. సంస్థలో జరుగుతున్న అంతర్గత పునర్నిర్మాణంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

లింక్డ్‌ఇన్ సీఈఓ డానియల్ షాపెరో ఉద్యోగులకు పంపిన మెయిల్స్ కంపెనీలోని తాజా మార్పులను ధృవీకరించారు. ముఖ్యంగా ఇంజనీరింగ్, ప్రొడక్ట్, మార్కెటింగ్, గ్లోబల్ బిజినెస్ ఆర్గనైజేషన్ విభాగాలపై ఈ లేఆఫ్స్ ప్రభావం ఎక్కువగా ఉండనుంది. అయితే ఈ నిర్ణయానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేరుగా కారణం కాదని.. భవిష్యత్తు వృద్ధిని దృష్టిలో ఉంచుకుని అత్యంత కీలకమైన ప్రాధాన్యతలపై దృష్టి సారించేందుకే ఈ మార్పులు చేస్తున్నామని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. లింక్డ్‌ఇన్ ఆదాయం గత త్రైమాసికంలో 12 శాతం పెరిగినప్పటికీ లేఆఫ్స్ దిశగా సంస్థ నడుస్తోంది. కంపెనీ లాభాల్లో ఉన్నా కూడా అదనపు వ్యయాలను తగ్గించుకోవడానికి, వెండర్ ఖర్చులు, వాడుకలో లేని ఆఫీస్ స్పేస్‌లను క్లోజ్ చేయడానికి సంస్థ పూనుకుంది. ఆస్ట్రియాలోని గ్రాజ్ ఆఫీస్‌ను కూడా మూసివేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. మైక్రోసాఫ్ట్ తన పూర్తి దృష్టిని AI మౌలిక సదుపాయాలపై పెడుతున్న వేళ అనుబంధ సంస్థల్లో ఖర్చుల కోత విధించింది.

ఈ లేఆఫ్స్ వల్ల ప్రభావితమైన ఉద్యోగులకు లింక్డ్‌ఇన్ తగిన పరిహారంతో పాటు ఇతర ప్రయోజనాలను కల్పించనుంది. 2026 ప్రారంభం నుండి టెక్ రంగంలో ఇప్పటివరకు లక్షకు పైగా ఉద్యోగాల కోత జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఒకప్పుడు సురక్షితమైన ఉద్యోగాలకు కేరాఫ్ అడ్రెస్ గా ఉన్న లింక్డ్‌ఇన్ వంటి కంపెనీలు కూడా ఇప్పుడు ఉద్యోగులను తొలగిస్తుండటంతో ఉద్యోగులు గందరగోళానికి గురవుతున్నారు ప్రపంచ వ్యాప్తంగా.