లోకల్‌‌ వస్తువులు అగ్గువ

లోకల్‌‌ వస్తువులు అగ్గువ

ఫారిన్‌‌ ప్రొడక్టుల ధరలు పెరుగుతాయ్‌‌

ఈ బడ్జెట్‌‌తో లోకల్ కంపెనీలకు మేలు

లెదర్‌‌, డెయిరీ, ఎలక్ట్రానిక్స్‌‌ సంస్థలకు ప్రయోజనం

దిగుమతిదారులకు తగ్గనున్న లాభాలు

చౌకగా లభ్యం కానున్న అగ్రిప్రొడక్ట్‌‌లు

బడ్జెట్‌‌పై ఎఫ్‌‌ఎంసీజీ మిశ్రమ స్పందన

వెలుగు, బిజినెస్‌‌డెస్క్: బడ్జెట్‌‌ వచ్చి వారం రోజులైపోయింది. ఇప్పటికీ దీనిపై చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ధరల్లో మార్పుల గురించి అంతటా చర్చ జరుగుతోంది. విదేశాల నుంచి వచ్చే ఎఫ్‌‌సీఎంజీ, ఎలక్ట్రానిక్స్‌‌, ఇతర ప్రొడక్టుల హోల్‌‌సేల్‌‌/రిటైల్‌‌ ధరలు పెరుగుతాయని, ఇండియా కంపెనీల వస్తువుల ధరలు తగ్గుతాయని ఎకానమిస్టులు చెబుతున్నారు.  అందుకే మేకిన్ ఇండియాకు పెద్ద పీటే వేశారని అంటున్నారు. లోకల్ ఉత్పత్తిదారులను ప్రోత్సహించేందుకు దిగుమతి సుంకాలను బాగా పెంచారు. ముఖ్యంగా చైనీస్ కంపెనీల నుంచి వచ్చే గూడ్స్‌‌ను తగ్గించడానికి కొన్ని ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్‌‌పై సుంకాలను వాయించేసింది ప్రభుత్వం. దిగుమతి చేసుకునే ఫుడ్, గ్రోసరీ ఐటమ్స్, షూలు, సీలింగ్ ఫ్యాన్స్, వుడెన్ ఫర్నీచర్, కిచెన్‌‌వేర్, అప్లియెన్సస్, హెయిర్‌‌‌‌డ్రయర్స్ వంటి వాటిపై బేసిక్ కస్టమ్ డ్యూటీని 10 శాతం వరకు పెంచింది. ఈ కస్టమ్స్ పెంచడం వెనుక ముఖ్య ఉద్దేశం స్థానిక ఉత్పత్తిదారులను ప్రోత్సహించడమేనని మంత్రి నిర్మల చెప్పారు.  ప్రభుత్వం మేకిన్‌‌ ఇండియాపై ఎక్కువగా ఫోకస్ చేయడంతో, ట్రెండ్, బాటా, ఖాదీమ్, రెలాక్సో, షాపర్స్ స్టాప్, ఫ్యూచర్ లైఫ్‌‌ స్టయిల్ ఫ్యాషన్స్ వంటి కంపెనీలు కూడా ఎక్కువగా లాభపడనున్నాయి. బేసిక్ కస్టమ్ డ్యూటీ పెంపుతో పాటు పడిపోయిన డిమాండ్‌‌ను రికవరీ చేయడానికి ప్రభుత్వం బాగా దృష్టిపెట్టింది. ఈ క్రమంలో భాగంగా పర్సనల్ ఇన్‌‌కమ్ ట్యాక్స్ రేట్లను తగ్గించింది. అయితే ఈ ట్యాక్స్ రేట్ల కోతతో వినియోగం ఏ మేరకు పెరుగుతుందో చూడాల్సి ఉందని ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ ఇండస్ట్రీ అంటోంది. రేట్లను తగ్గించడం మంచి పరిణామమేనని పేర్కొంటోంది.

ఎలక్ట్రిక్‌‌ వస్తువుల ధరలు పెరగొచ్చు

రేట్ల కోతతో పాటు రూరల్ డెవలప్‌‌మెంట్ కోసం పలు పథకాలను గవర్న్‌‌మెంట్ తీసుకొచ్చింది. కిసాన్ రైల్, కృషి ఉడాన్, చేపల ఉత్పత్తి పెంచడం, కరువు జిల్లాల్లో నీటి వసతి పెంపు, రైతులకు సోలార్ పంపుసెట్లు ఇలా 16 రకాల పథకాలను ప్రవేశపెట్టింది. ఇవన్నీ రైతుల ఆదాయం ఎలా పెంచాలన్న దానిపైనే ఫోకస్ చేస్తూ తెచ్చింది. ఈ పథకాలు సరిగ్గా అమలైతేనే, గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోళ్లు పెరుగుతాయని ఎఫ్‌‌ఎంసీజీ ఇండస్ట్రీ పేర్కొంది.  ఎఫ్‌‌ఎంసీజీ మార్కెట్‌‌లో వాల్యూమ్‌‌పరంగా హిందుస్తాన్ యునిలివర్‌‌‌‌ మొదటి స్థానంలో ఉంది. దాని తర్వాత ఐటీసీ, డాబర్, జీసీపీఎల్, మారికో, కోల్‌‌గేట్ ఉన్నాయి. సిగరెట్లు, హుక్కా, జర్దా వంటి పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీ పెంచడంతో ఇవి మరింత కాస్ట్‌‌లీ కానున్నాయి. బడ్జెట్ వచ్చినప్పటి నుంచి ఐటీసీ కంపెనీ షేర్లు కూడా కాస్త ప్రతికూలంగానే ఉన్నాయి. గోల్డెన్ టుబాకో, వీఎస్‌‌టీ ఇండస్ట్రీస్, గాడ్‌‌ఫ్రేఫిలిప్స్, ఎన్‌‌టీసీ ఇండస్ట్రీస్ వంటి సిగరెట్ మాన్యుఫాక్చరర్స్ బడ్జెట్‌‌పై పెదవి విరుస్తున్నాయి. వీటితో పాటు రిఫ్రిజిరేటర్స్, ఎయిర్ కండిషనర్స్ వంటి కంప్రెసర్స్‌‌పై కస్టమ్ డ్యూటీని 250 బేసిస్ పాయింట్లు పెంచడంతో వోల్టాస్, బ్లూస్టార్ వంటి వైట్ గూడ్ మేకర్స్ తమ బ్రాండ్లపై ధరలు పెంచే అవకాశం కనిపిస్తోంది.

బొమ్మలకు ధరల బెడద

టాయ్ ఇంపోర్టర్లకు షాకిస్తూ.. ప్రభుత్వం కస్టమ్ డ్యూటీని 40 శాతం పెంచింది. 20 శాతంగా ఉన్న టాయ్ దిగుమతి సుంకాన్ని 60 శాతంగా నిర్ణయించారు. దీని వల్ల దేశంలో ఉన్న లక్ష మందికి పైగా టాయ్ రిటైలర్లు ప్రభావితం కాబోతున్నారు. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా  టాయ్ హోల్‌‌సేలర్స్ సమ్మె కూడా చేపట్టారు. 200 శాతం డ్యూటీ  పెంపు టాయ్ ఇండస్ట్రీకి అతిపెద్ద షాక్ అని, మార్కెట్ దీన్ని జీర్ణించుకోలేకపోతుందని ఇండస్ట్రీ ప్రతినిధులంటున్నారు. వెంటనే అంతకుముందున్న20 శాతం డ్యూటీని తీసుకురావాలని తాము డిమాండ్ చేస్తున్నట్టు, దీని కోసం ఒక రోజు సమ్మె చేపట్టినట్టు తెలిపారు. టాయ్ దిగుమతులు వార్షికంగా రూ.2500 కోట్ల వరకు ఉంటాయి. వీటిలో 75 శాతం చైనా నుంచే వస్తాయి. రూ.2500 కోట్ల టాయ్ దిగుమతుల్లో, కోల్‌‌కతా షేరు రూ.130 కోట్ల వరకు ఉంటుంది.

డెయిరీ కంపెనీలకు లాభాలపంట

మిల్క్ ప్రాసెసిం గ్ కెపాసిటీని 2025 నా టికి రెండిం తలు చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడంతో, జాబిలియంట్ ఫుడ్‌ వర్క్స్, హెచ్‌ యూఎల్, నెస్లే వంటి కంపెనీలూ, వా టి షేర్లూ లాభపడనున్నాయని విశ్లేషకులు చెప్పారు. దీంతో ఈ కంపెనీల స్టాక్స్‌కు కూడా విశ్లేషకులు మంచి రేటింగ్‌‌నే ఇస్తున్నారు. అంతేకాక కొన్నిఅగ్రికల్చర్ ప్రొడక్ట్‌‌లపై కస్టమ్స్ డ్యూటీని ప్రభుత్వం విత్‌ డ్రా చేసింది. దీంతో ఇవి మరింత చౌకగా లభ్యం కానున్నాయి. 10 వేల టన్నుల వరకు లిక్విడ్ మిల్క్‌‌ను, 5 లక్షల టన్నుల వరకు బటర్ నెయ్యి, బటర్ ఆయిల్‌‌ను సుంకాలు లేకుండా దిగుమతి చేసుకోవచ్చు.