మళ్లీ డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ రేటు పెరగనుందా..? ఈ సారి గ్యాస్ బండపై ఎంత పెంచుతారంటే?

మళ్లీ డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ రేటు పెరగనుందా..? ఈ సారి గ్యాస్ బండపై ఎంత పెంచుతారంటే?

ఇరాన్-అమెరికా మధ్య యుద్ధ వాతావరణం కారణంగా అంతర్జాతీయంగా సరఫరా వ్యవస్థ దెబ్బతినడంతో.. దేశీయంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరగడం ఖాయమని సంకేతాలు వస్తున్నాయి. ఇప్పటికే మే 1న కమర్షియల్ సిలిండర్ పై ఏకంగా రూ.993 భారాన్ని మోపిన మోడీ ప్రభుత్వం.. ఇప్పుడు సామాన్యులు వాడే డొమెస్టిక్ సిలిండర్లు, ఇంధన ధరలపై కన్నేసింది. ఢిల్లీలో ప్రస్తుతం రూ. 913 ఉన్న గ్యాస్ డొమెస్టిక్ సిలిండర్ ధర.. మరో రూ.50 వరకు పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల ద్వారా లీకైంది.

ధర ఎంత పెరగొచ్చు?
ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న లీకుల ప్రకారం.. పెట్రోల్, డీజిల్ రేటు లీటరుకు రూ. 4 నుండి 5 వరకు పెరిగే ఛాన్స్ ఉంది. ఇక గృహ అవసరాలకు వాడే 14.2 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.40 నుండి 50 వరకు పెరగవచ్చని అంచనా. మోడీ సర్కార్ ఇప్పటికే మార్చి 7న డొమెస్టిక్ సిలిండర్ రూ.60 పెంచేసిన సంగతి తెలిసిందే. ఈ నెలలో ఇప్పటివరకు ధరలను స్థిరంగా ఉంచినప్పటికీ.. గ్లోబల్ మార్కెట్ ఒత్తిడి కారణంగా పెంపు తప్పనిసరి అంటున్నారు ప్రభుత్వ అధికారులు. ప్రస్తుతం ఢిల్లీలో రూ. 3,071 గా ఉన్న కమర్షియల్ సిలిండర్ ధరలు హోటల్స్, ఫుడ్ ఇండస్ట్రీపై భారాన్ని పెంచేశాయి. మరోపక్క అసలు రేటుకు రెండింతలకు బ్లాక్ మార్కెట్లో కమర్షియల్ సిలిండర్లు అమ్ముడవటంతో చాలా చోట్ల చిన్న వ్యాపారులు బిజినెస్ క్లోజ్ చేసేస్తున్నారు. 

మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్?
ధరల పెంపు కంటే ముందుగానే ప్రధాని మోడీ ప్రజలను మానసికంగా సిద్ధం చేసే పనిలో పడ్డారు. హైదరాబాద్‌లో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. విదేశీ మారక నిల్వలను ఆదా చేసేందుకు పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించాలని కోరారు. మెట్రో ఉన్న నగరాల్లో మెట్రోలోనే ప్రయాణించమని, వీలైతే కార్ పూలింగ్ చేయాలని సూచించారు. మరీ ముఖ్యంగా కోవిడ్ కాలంలో పాటించిన నియమాలను మళ్లీ గుర్తు చేస్తూ.. ఆన్‌లైన్ మీటింగ్స్, వర్చువల్ కాన్ఫరెన్స్‌లు, వర్క్ ఫ్రమ్ హోమ్ కి ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు.

భారత్ తన చమురు అవసరాల కోసం విదేశాలపైనే ఎక్కువగా ఆధారపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు ఆకాశాన్నంటుతుండటంతో.. దిగుమతుల కోసం భారీగా డాలర్లను ఖర్చు చేయాల్సి వస్తోంది. పొరుగు దేశాలతో పోలిస్తే భారత్ ఇప్పటివరకు ధరలను నియంత్రణలోనే ఉంచినప్పటికీ, ఇకపై ఆ భారాన్ని భరించడం కష్టమని ప్రభుత్వం భావిస్తోంది. ఇంధన పొదుపు ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవాలని ప్రధాని కోరుతుండగా.. ధరల మంట సామాన్యుడి ఇంటి బడ్జెట్‌ను ఎంత నాశనం చేయనుందో వేచి చూడాల్సిందే. ఎన్నికలకు ముందు రేట్లు పెంచేదే లేదంటూ వెంటనే ఖండించిన కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్స్ తర్వాత సైలెంట్ గా ఉండటం చూస్తుంటే నిజంగానే రేట్ల పెంపు త్వరలో ఉండబోతోందని సోషల్ మీడియాలో పెద్ద చర్చ కొనసాగుతోంది.