V6 News

మరో 3, 4 ఏళ్లు గ్యాస్ కష్టాలు తప్పవా: రాబోయే రోజులు గడ్డు కాలమే..!

మరో 3, 4 ఏళ్లు గ్యాస్ కష్టాలు తప్పవా: రాబోయే రోజులు గడ్డు కాలమే..!

దేశంలో గ్యాస్ వినియోగదారులకు రానున్న రోజుల్లో గడ్డుకాలం తప్పదని తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా దెబ్బతిన్న LPG సరఫరా వ్యవస్థలు మళ్లీ సాధారణ స్థితికి రావడానికి కనీసం 3 నుండి 4 ఏళ్ల సమయం పట్టవచ్చని ప్రభుత్వ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ మేఘాలు.. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి వద్ద దిగ్బంధనం, ఇరాన్ దాడుల కారణంగా భారత్‌కు ఎల్‌పీజీ దిగుమతులు కష్టతరంగా మారాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

సరఫరా పునరుద్ధరణకు ఏళ్ల సమయం..
ప్రస్తుతం గల్ఫ్ ప్రాంతంలో గ్యాస్ ప్రొడక్షన్ దాదాపుగా నిలిచిపోయింది బాంబు దాడులతో జరిగిన డ్యామేజ్ కారణంగా. అయితే ఈ ఉత్పత్తి తాత్కాలికంగా ఆగిపోయిందా లేదా అక్కడి మౌలిక సదుపాయాలకు శాశ్వత నష్టం జరిగిందా అనే విషయంలో క్లారిటీ లేదు. ఉత్పత్తి సంస్థల సమాచారం ప్రకారం.. ఈ వ్యవస్థలను మళ్లీ గాడిలో పెట్టడానికి కనీసం 3 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందని వెల్లడైంది. భారత్ తన ఎల్‌పీజీ అవసరాల కోసం 60 శాతం దిగుమతులపైనే ఆధారపడుతున్న వేళ ఇది చేదువార్త అని చెప్పుకోవాలి.

దిగుమతులపై యుద్ధ ప్రభావం..
యుద్ధానికి ముందు భారత్ దిగుమతి చేసుకుంటున్న గ్యాస్ లో దాదాపు 90 శాతం హార్ముజ్ జలసంధి ద్వారానే వచ్చేవి. ప్రస్తుత ఉద్రిక్తతల వల్ల ఇది 55 శాతానికి పడిపోయింది. యూఏఈ 41%, ఖతార్ 22% మన గ్యాస్ దిగుమతులను తీరుస్తున్నాయి. ఇప్పుడు ఆ ప్రాంతాల్లో దాడులు జరుగుతుండటంతో రవాణా ఖర్చులు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు విపరీతంగా పెరిగిపోయాయి. దీని ప్రభావం నేరుగా సిలిండర్ ధరలపై పడుతోంది.

నిల్వ సామర్థ్యం తక్కువ.. ధరలు ఎక్కువ
భారత్ ఏటా ఎల్‌పీజీ డిమాండ్ సుమారు 33 మిలియన్ టన్నులు కాగా.. మన దగ్గర కేవలం 15 రోజులకు సరిపడా నిల్వ సామర్థ్యం మాత్రమే ఉంది. మార్చి మధ్య కాలం నుండి ఇప్పటివరకు 14.2 కేజీల డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.60 పెరగగా, కమర్షియల్ సిలిండర్ ధర ఏకంగా రూ.115 పెరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో సరఫరాలో 40-50 శాతం అంతరాయం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. 

ప్రభుత్వ ప్రత్యామ్నాయ వ్యూహాలు..
గృహ వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం కోవిడ్ సమయంలో అనుసరించిన వ్యూహాలను మళ్లీ అమలు చేస్తోంది. ఇతర దేశాల నుండి గ్యాస్ సేకరించడం, దేశీయంగా ఉత్పత్తిని పెంచడం, వినియోగంపై అవగాహన కల్పించడం వంటి చర్యలు చేపడుతోంది. అయినప్పటికీ హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న పరిశ్రమలకు పెరిగిన గ్యాస్ ధరలు పెను భారం కానున్నాయి. అంతర్జాతీయ ధరల అస్థిరత కొనసాగితే సబ్సిడీ భారం కూడా ప్రభుత్వంపై పెరగనుంది.