ప్రధాని మోడీ దేశ ప్రజలను ఏడాది పాటు బంగారం కొనొద్దంటూ పిలుపు ఇవ్వటంపై దేశవ్యాప్తంగా బంగారు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క ముక్కలో జనం గోల్డ్ కొనొద్దంటూ ప్రధాని చెప్పారని.. అయితే ఈ రంగంపై ఆధారపడిన లక్షల మంది స్వర్ణకారుల పరిస్థితి ఏంటి వాళ్ల జీవనోపాధి ఎలా అంటూ జ్యూవెలరీ వ్యాపారులు నిలదీస్తున్నారు. సంవత్సరం పాటు తాము, తమను నమ్ముకుని పనిచేస్తున్న వేలాది మంది వర్కర్స్ ఎలా జీవించాలంటూ రోడ్డెక్కుతున్నారు.
విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసేందుకు ఏడాది పాటు బంగారు కొనుగోళ్లు, విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని ప్రధాని మోదీ చేసిన రిక్వెస్ట్ ఉత్తరప్రదేశ్ లక్నోలోని నగల వ్యాపారుల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ ప్రకటనను నిరసిస్తూ లక్నో సరాఫా పరిశ్రమకు చెందిన వ్యాపారులు, కార్మికులు సోమవారం ఆషియానాలోని పవర్‌హౌస్ క్రాసింగ్ వద్ద భారీ నిరసన చేపట్టారు. ప్రధాని వ్యాపారాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం వల్ల సంప్రదాయ ఆభరణాల రంగం కుప్పకూలుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
లక్నో నగరంలో సుమారు 6వేల సరాఫా, జ్యువెలరీ సంస్థలు ఉన్నాయి. ఈ రంగంపై ప్రత్యక్షంగా 30వేల కుటుంబాలు, పరోక్షంగా లక్షకు పైగా కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయని వారు చెబుతున్నారు. ముఖ్యంగా నగల తయారీలోని స్వర్ణకారులు, పాలిష్ చేసేవారు, డిజైనర్లు, రవాణా కార్మికులు ఈ ప్రకటనతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే ఆకాశాన్నంటుతున్న ధరలు, తగ్గిన డిమాండ్, ఆర్థిక ఇబ్బందులతో తాము సతమతమవుతున్న తమకు గోరుచుట్టుపై రోకలిపోటులా మారిందని వ్యాపారులు అంటున్నారు.
ప్రజలు బంగారం కొనడం మానేస్తే వేలాది మంది కార్మికుల కుటుంబాలను ఎవరు పోషిస్తారని లక్నో సరాఫా అసోసియేషన్ అధ్యక్షుడు మనీష్ కుమార్ వర్మ మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం ఈ రంగంలోని కార్మికులకు జీతాలు ఇస్తుందా అంటూ నిలదీశారు. భారతీయులకు బంగారం కేవలం లగ్జరీ వస్తువు మాత్రమే కాదని, అది ఒక సంప్రదాయ ఆర్థిక రక్షణ కవచమని, కష్టకాలంలో ఆదుకునే దీర్ఘకాలిక పెట్టుబడని గుర్తు చేశారు. మోడీ ప్రకటనతో చిన్న మధ్యతరహా వ్యాపారులు కనుమరుగయ్యే ప్రమాదం ఉందన్నారు.
ప్రధాని మోడీ నిర్ణయం వల్ల వ్యవస్థీకృత పెద్ద కంపెనీల కంటే చిన్న వ్యాపారులే ఎక్కువగా నష్టపోతారని చౌక్ సరాఫా అసోసియేషన్ జనరల్ సెక్రటరీ వినోద్ మహేశ్వరి చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు తమ బంగారు నిల్వలను పెంచుకుంటున్న వేళ సామాన్య ప్రజలను గోల్డ్ కొనవద్దని కోరడం సరికాదని వ్యాపారులు వాదించారు. దేశ ఆర్థిక వ్యవస్థలో ఉపాధి కల్పనకు కీలకమైన ఈ రంగాన్ని విస్మరించవద్దంటూ అధికారులకు వినతి పత్రం సమర్పించారు. దిగుమతులు తగ్గించడం వేరు.. దేశీయ వాణిజ్య వ్యవస్థను బలహీనపరచడం వేరని వారు అభిప్రాయపడ్డారు.
