ఇక్కడ పేరుకే ఎలక్షన్స్.. ఎవరూ ప్రచారం చేయరు, హామీలివ్వరు

ఇక్కడ పేరుకే ఎలక్షన్స్.. ఎవరూ ప్రచారం చేయరు, హామీలివ్వరు

నవంబర్ 17న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులందరూ ప్రజల నుంచి ఓట్లు కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా చురుకుగా ప్రచారం చేస్తున్నారు. అయితే, మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పూర్ జిల్లాలో ఝందానా అనే గ్రామంలో మాత్రం పరిస్థితి ఇందుకు వ్యతిరేకంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎన్నికల హడావిడి లేదు.. ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా వచ్చి ఇక్కడ ప్రచారం చేయడు. ఇది ఇప్పుడు కాదు.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఏ రాజకీయ నాయకుడు ప్రచారం చేయడానికి ఇక్కడికి రాలేదు. అటువంటి పరిస్థితిల్లో ఎన్నికల సంఘం నివాసితులకు ఓటు వేయమని విజ్ఞప్తి చేయడమే కాకుండా గ్రామంలో ఎన్నికల ప్రక్రియను సులభతరం చేయడానికి అత్యంత కృషి చేయాల్సి ఉండడాన్ని నొక్కి చెబుతోంది.

నవంబర్ 17న ఎన్నికలకు ముందు ఝండానా గ్రామంలోని పోలింగ్ కేంద్రానికి చేరుకోవడానికి, పోల్ అధికారులు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్‌లను (ఈవీఎంలు) తీసుకుని బోటు షికారు చేసి, ఆపై కొండ ప్రాంతంలో కాలినడకన ఓ కఠిన మార్గంలో ప్రయాణించాలి. రిజర్వ్‌డ్ అలిరాజ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఈ మారుమూల గ్రామంలో సుమారు వెయ్యి మంది నివసిస్తున్నారు. అందులో 763 మంది షెడ్యూల్డ్ తెగలకు చెందిన ఓటర్లు ఉన్నారని, కానీ ఈ ప్రాంతంలో ఏ అభ్యర్థి ప్రచారం చేయలేదని స్థానికులు తెలిపారు.  

ముఖ్యంగా, ఝండానా గ్రామంలో చాలా సంవత్సరాల క్రితమే మునిగిపోయింది. ఇక్కడి గిరిజనులు రహదారి వంటి కనీస సౌకర్యాలు లేకుండా జీవించవలసి ఉన్నప్పటికీ, వారు వదిలి వెళ్ళడానికి ఇష్టపడలేదు. అలిరాజ్‌పూర్ జిల్లా కేంద్రానికి కేవలం 60 కి.మీ దూరంలో ఉన్నప్పటికీ, ఈ గ్రామం అనేక దశాబ్దాలుగా అభివృద్ధి, మౌలిక సదుపాయాల పరంగా వెనుకబడి ఉంది. రాబోయే ఎన్నికలకు సంబంధించి కొన్ని ఇళ్లపై రాజకీయ పార్టీల జెండాలు మాత్రమే ఇప్పుడు కనిపిస్తున్నాయి.

మరో ముఖ్యమైన విషయమేమిటంటే.. ఇక్కడ నీటి కొరత కూడా ఎక్కువే. ఇక ఎండాకాలంలో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఆ ప్రాంతంలో చాలా వరకు రాళ్లు ఉండడంతో బోరు వేసినా నీళ్లు రావడం లేదని, దీని వల్ల మనుషులతో పాటు జీవజాతీ ప్రమాదంలో ఉందని అంటున్నారు. సరైన రోడ్లు లేకపోవడంతో బయటికి వెళ్లాలంటే పడవలపైనే ఆధారపడాల్సి వస్తోందని, ఎవరైనా అనారోగ్యానికి గురైనప్పుడు, వారిని పడవలో మాత్రమే సమీపంలోని ఆసుపత్రికి తీసుకువెళ్తున్నామని చెబుతున్నారు. దీంతో చాలా మంది ఇక్కడి సమస్యలకు తాళలేక గుజరాత్‌కు వలస వెళ్లారని అంటున్నారు.

అలిరాజ్‌పూర్‌కు చెందిన కలెక్టర్ అభయ్ అరవింద్ బెడేకర్ మాట్లాడుతూ.. గ్రామానికి ప్రత్యామ్నాయ మార్గం ఉందని, అయితే ఐదు కిలోమీటర్లు నడవాల్సి ఉంటుందని చెప్పారు. కాంక్రీట్ రోడ్డు వేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారని, అయితే అది అటవీ భూమి గుండా వెళ్లాలని ఆయన తెలిపారు. రోడ్డు నిర్మాణానికి అనుమతి కోసం అటవీశాఖకు లేఖ రాశామని, ఆమోదం లభించిన తర్వాత రిమోట్ విలేజ్ రోడ్ పథకం కింద కాంక్రీట్ రోడ్డు నిర్మిస్తామని బేడేకర్ వెల్లడించారు.

ఈ స్థానం నుంచి బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు వీరే

అధికార బీజేపీ అలీరాజ్‌పూర్ నియోజకవర్గం నుంచి నాగర్ సింగ్ చౌహాన్‌ను బరిలోకి దించగా, కాంగ్రెస్ ప్రస్తుత ఎమ్మెల్యే ముఖేష్ పటేల్‌ను రాబోయే ఎన్నికలకు నామినేట్ చేసింది.