సరస్వతీ దేవి కరుణించినా.. ధనలక్ష్మీ దేవి కనికరిస్తలే

సరస్వతీ దేవి కరుణించినా.. ధనలక్ష్మీ దేవి కనికరిస్తలే

దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించలేదనే సామెత వినే ఉంటారు. అలాగే ఉంది ఓ విద్యార్థిని కథ. చదువులో ఆమెకు తిరుగులేదు. అయినా ఉన్నత చదువులు చదువలేకపోతోంది. డాక్టర్ కోర్సు చదవడం కోసం చాలామంది సంవత్సరాల పాటు కోచింగ్‎లు తీసుకుంటుంటారు. అయినా వారికి మంచి ర్యాంకు రాదు. కానీ ఈ విద్యార్థిని మాత్రం సొంతంగా ప్రిపేరై.. నీట్‎లో మంచి ర్యాంకు సాధించింది. అయినా ఆర్థికస్తోమత లేక కాలేజీలో చేరే దారి కనిపించడంలేదు.

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి చెందిన లక్ష్మి, నర్సింహలు దంపతులు. వీరిది నిరుపేద కుటుంబం. పేదరికానికి తోడు అనారోగ్య సమస్యలు ఆ ఇంటి యజమానిని వెంటాడుతున్నాయి. నర్సింహ గత కొంత కాలం నుంచి పక్షవాతంతో బాధపడుతున్నాడు. ఆయన కుటుంబంతో కలిసి భగీరథకాలనీలో చిన్న టీస్టాల్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. నర్సింహ దంపతులకు ఇద్దరు పిల్లలు. తల్లిదండ్రుల కష్టాన్ని కళ్లారా చూస్తున్న పిల్లలు కూడా బాగా కష్టపడి చదువుకుంటున్నారు. పిల్లల్లో గోపిక అనే అమ్మాయి చదువులో ముందుంటుంది. గోపిక టెన్త్, ఇంటర్‎లో మంచి మార్కులు తెచ్చుకుంది. ఇంటర్ తర్వాత లాక్‎డౌన్ టైంలో ఓ వైపు తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటూనే నీట్‎కు సొంతంగా ప్రిపేర్ అయ్యింది. ఆ పరీక్షలో గోపికకు మంచి ర్యాంకు వచ్చింది. దాంతో ఆమెకు ఫ్రీగా సీటు లభించే అవకాశం దక్కింది. కానీ ఆర్థిక ఇబ్బందులు గోపిక చదువుకు ఆటంకంగా మారాయి. కనీస ఫీజుతోపాటు ఇతర ఖర్చులకు కూడా డబ్బులు లేకపోవడంతో అడ్మిషన్ తీసుకోలేకపోయింది. కూతురు ఉన్నత చదువుకు దూరమవుతోందన్న బాధతో ఈ కుటుంబం లోలోపలే కుమిలిపోయిందే తప్ప.. ఎవరినీ చేయి చాచి అడిగింది లేదు. అడ్మిషన్ కోసం గతేడాది ఆఖరు తేదీ వరకు ఎదురుచూసింది. ఎవరూ ఆదుకోకపోవడంతో ఆ అవకాశం చేజారిపోయింది.

కాలేజీలో చేరకపోయినా ఏమాత్రం నిరాశపడకుండా.. గోపిక ఈ ఏడాది కూడా నీట్ పరీక్ష రాసింది. ఈసారి కూడా ఆమెను నీట్ ర్యాంక్ వరించింది. నీట్‎లో 720 మార్కులకు గాను 613 మార్కులతో 13, 506 ర్యాంక్ సాధించింది. దాంతో ఆమెకు గాంధీ, ఉస్మానియా మెడికల్ కాలేజీలలో ఫ్రీగా సీటు లభించే అవకాశం ఉంది. అయితే గోపిక సాధించిన మార్కులలో అభివృద్ధి వచ్చింది కానీ, ఆమె కుటుంబ ఆర్థిక పరిస్థితుల్లో మాత్రం ఏం అభివృద్ధి రాలేదు. గోపిక కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందులు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. దాంతో ఈసారి కూడా గోపికకు మెడికల్ కాలేజీలో అడ్మిషన్ దక్కుతుందో లేదో తెలియక ఆ కుటుంబం కొట్టుమిట్టాడుతోంది. గవర్నమెంటు సీటే అయినా అడ్మిషన్ ఫీజు, ఇతర ఖర్చులకు కలిపి లక్షల్లో ఖర్చు అవుతుంది. ఆ మొత్తాన్ని కూడా భరించలేని స్థితిలో ఆమె కుటుంబం ఉంది. చేతిలో చిల్లిగవ్వ లేక మళ్లీ ఈ సారి కూడా చదువుకు దూరమవుతానన్న బాధ ఆ నిరుపేద విద్యార్థినిని బాధిస్తోంది. చదువుకోవాలన్న తపన, ఆరాటంతో పాటు ఆర్థిక స్తోమత లేకపోతే ఉన్నత విద్యావకాశాలను అందుకోలేమన్న ఆవేదన మాత్రం ఈ కుటుంబాన్ని వేదనకు గురిచేస్తోంది. తమ కూతురును డాక్టర్‎ను చేయాలన్న కోరిక.. కలగా మిగిలిపోకూడదన్నది ఆమె తల్లిదండ్రుల ఆశ. అందుకే దాతల ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు.