ఒడిశా సీఎం చుట్టూ అవినీతి కోటరీ: మోదీ

ఒడిశా సీఎం చుట్టూ అవినీతి కోటరీ: మోదీ

అంగుల్ (ఒడిశా): ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఆఫీస్, నివాసం అవినీతి కోటరీ చేతుల్లో ఉన్నదని ప్రధాని మోదీ విమర్శించారు. ఆ కోటరీ రాష్ట్రాన్ని, యువత కలలను నాశనం చేసిందని మండిపడ్డారు. ‘‘ఒడిశాలో పేదరికం చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఎంతో  ఖనిజ సంపద ఉన్న రాష్ట్రం ఇలా కావడానికి కారకులెవరు? బీజేడీ ప్రభుత్వాన్ని కొందరు అవినీతిపరులు కంట్రోల్ చేస్తున్నారు. సీఎం ఆఫీస్, నివాసం వాళ్ల చేతుల్లోనే ఉంది. బీజేడీలోని చిన్న చిన్న కార్యకర్తలు కూడా కోట్లకు ఎదిగారు” అని అన్నారు. సోమవారం ఒడిశాలో మోదీ పర్యటించారు. 

పూరి జగన్నాథ్ టెంపుల్​లో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో రెండు కిలోమీటర్ల మేర రోడ్ షో చేశారు. అనంతరం టెంకానాల్ లోక్ సభ నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. ‘‘2014లో కేంద్రంలో మేం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త మినరల్ ఎక్స్ ప్లోరేషన్ పాలసీని తీసుకొచ్చాం. దీని కింద ఒడిశాకు అధిక రాయల్టీ చెల్లిస్తున్నాం. డీఎంఎఫ్ కింద ఇప్పటి వరకు రూ.26 వేల కోట్లు విడుదల చేశాం. ఆ నిధులను రోడ్లు, స్కూళ్ల నిర్మాణం, మంచి నీళ్ల సౌకర్యం కల్పించేందుకు వాడాలి. కానీ బీజేడీ ప్రభుత్వం ఆ నిధులను దుర్వినియోగం చేసింది” అని ఫైర్ అయ్యారు.

పూరి టెంపుల్​కు రక్షణ కరువు.. 

బీజేడీ పాలనలో పూరి జగన్నాథ్ టెంపుల్​కు రక్షణ లేకుండా పోయిందని మోదీ అన్నారు. ‘‘జగన్నాథ్ ఆలయంలోని రత్న భాండాగారం తాళం చెవులు ఆరేండ్లుగా కనిపించడం లేదు. దీనిపై జ్యుడీషియల్ కమిషన్ ఎంక్వైరీ చేసి రిపోర్టు ఇచ్చింది. కానీ ఆ రిపోర్టును బీజేడీ ప్రభుత్వం బయటపెట్టలేదు. ఇందులో బీజేడీ హస్తముందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి కారణం సీఎం చుట్టూ చేరిన కోటరీనే” అని ఆరోపించారు.