స్టాక్ మార్కెట్ భాషలో మహారాష్ట్ర వైద్యుల పెళ్లి పత్రిక

 స్టాక్ మార్కెట్ భాషలో మహారాష్ట్ర వైద్యుల పెళ్లి పత్రిక

పెళ్లిళ్ల సీజన్ దగ్గర పడుతుండడంతో చాలామంది తమ వివాహాన్ని వెరైటీగా, ఆడంబరంగా చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పెళ్లి విషయంలోనే కాదు.. ఆహ్వాన పత్రిక విషయంలోనూ వెరైటీగా ఆలోచిస్తున్నారు. అదే తరహాలో మహారాష్ట్రకు చెందిన వైద్యుల ఇన్విటేషన్ కార్డ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో గొప్పేముంది అనుకుంటున్నారా.. ఈ కార్డుకు స్టాక్ మార్కెట్ ఇండియా సంస్థ ఇన్ స్పైర్ అయ్యి తమ అధికారిక ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్​  చేసింది.  

స్టాక్ మార్కెట్ ఇండియా షేర్ చేసిన పోస్ట్ ప్రకారం.. నాందేడ్‌కు చెందిన ఒక జంట తమ వివాహ ఆహ్వానాన్ని స్టాక్ మార్కెట్ పదజాలంతో రూపొందించారు. వధూవరులకు డాక్టర్ సందేశ్ మెడిసిన్ లిమిటెడ్, డాక్టర్ దివ్య అనస్థీషియా లిమిటెడ్ అనే క్యాప్షన్ ను జత చేయగా.. వివాహ వేడుకను "లిస్టింగ్ వేడుక"గా, స్నేహితులు, కుటుంబ సభ్యులను "రిటైల్ పెట్టుబడిదారులు"గా, సంగీత్ ను 'రింగింగ్ బెల్', రిసెప్షన్ ను 'మధ్యంతర డివిడెండ్ చెల్లింపు'గా రాసుకొచ్చారు. వివాహం జరుగు స్థలాన్ని స్టాక్ ఎక్సేంజీగా పోల్చిన మేకర్స్.. ఆహ్వానించేవారిని ప్రమోటర్స్ గా అభివర్ణించారు.

అయితే వీరి పెళ్లి గుల్బర్గాలోని హున్నాబాద్‌ రోడ్డులోని సకాసర్‌ గార్డెన్స్‌లో డిసెంబర్ 6,7 తేదీలలో జరగనుంది. వైరల్ అవుతున్న ఈ కార్డును చూసి ఆశ్చర్యపోయిన స్టాక్ మార్కెట్ ఇండియా సంస్థ తమ  సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో నెటిజన్లు పలురకాలుగా కామెంట్ చేస్తున్నారు. కొందరు చాలా అద్భుతంగా ఉందని, మరికొందరు తాము ఇప్పటివరకు చూసిన వాటిల్లో ఇదే ఆసక్తికరమైన వివాహ పత్రిక అని రాసుకొచ్చారు. మరికొందరేమో స్టాక్ మార్కెట్ డై హార్డ్ ఫ్యాన్ అని భిన్నమైన కామెంట్స్ ను జోడించారు.