హయత్ నగర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ హార్డ్‌వేర్, ఎలక్ట్రికల్ షాపులో మొదలైన మంటలు.. క్షణాల్లోనే పక్కనే ఉన్న పరుపుల షాపుకు విస్తరించి భీభత్సాన్ని సృష్టించాయి. ఎగిసిపడుతున్న మంటలు, దట్టమైన పొగతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ముందుగా జయశ్రీ ఎలక్ట్రానిక్ అండ్ హార్డ్‌వేర్ షాపులో మంటలు చెలరేగాయి. ఆ మంటలు పక్కనే ఉన్న పరుపుల తయారీ షాపుకు వ్యాపించడంతో ప్రమాద తీవ్రత రెట్టింపైంది. పరుపులు, ఇతర ప్లాస్టిక్ వస్తువులు ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించి.. ఆ రెండు షాపులు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటల ధాటికి సమీపంలోని మరో రెండు షాపులు కూడా స్వల్పంగా దెబ్బతిన్నాయి.
►ALSO READ | సికింద్రాబాద్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం.. ప్రయాణికులపైకి దూసుకెళ్లిన బస్సు
ఈ ప్రమాదంలో షాపుల బయట నిలిపి ఉంచిన ఒక బైక్ కూడా పూర్తిగా కాలి బూడిదైపోయింది. సమాచారం అందుకున్న వెంటనే హయత్ నగర్ అగ్నిప్రమాద సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, షాపు లోపల పరుపుల నిల్వలు ఉండటంతో.. మంటలు ఆరిపోయినట్టే కనిపిస్తూనే మళ్ళీ మళ్ళీ రాజుకుంటున్నాయి. ఈఘటనలో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
ప్రస్తుతం ఫైర్ సిబ్బంది నిరంతరాయంగా శ్రమిస్తూ మంటలు పూర్తిగా ఆరిపోయేలా చర్యలు చేపడుతున్నారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
