సికింద్రాబాద్ రేతి ఫైల్ బస్ స్టాప్ దగ్గర ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ఓ ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా బస్టాండ్‌లో ఎదరుచూస్తున్న ప్రయాణికులపైకి దూసుకెళ్లింది. ఈ ఊహించని పరిణామంతో ప్రయాణికులు ప్రాణభయంతో అటు ఇటు పరుగులు తీశారు. అయితే పెను ప్రమాదం తృటిలో తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
కానీ ఈ ఘటనలో బస్సు ఢీకొట్టడంతో ఒక ప్రయాణికుడు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే తోటి ప్రయాణికులు స్పందించి 108 సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది.. గాయపడిన వ్యక్తికి ప్రాథమిక చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అజాగ్రత్తగా బస్సు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందా? లేక సాంకేతిక లోపమా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
