
హైదరాబాద్ ఓల్డ్ సిటీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ భవనంలో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. గుల్జార్ కృష్నా పెరల్స్ & మోడీ పెరల్స్ మొదటి అంతస్తులో అగ్ని ప్రమాదం జరిగింది.మంటలు ఎగసిపడుతుండటంతో భయంతో స్థానికులు పరుగులు తీశారు. ప్రమాద సమయంలో భవనంలో నాలుగు కుటుంబాలు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.
స్థానికుల సమాచారంతో 10 ఫైర్ ఇంజిన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఫైర్ సేఫ్టీ అధికారులు మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ముగ్గురు చిన్నారులు సహా 13 మందిని ఆస్పత్రికి తరలించారు.
భవనంలో ఇంకా 30 మంది ఉన్నారని స్థానికులు తెలిపారు. క్షతగాత్రులు ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో పది అంబులెన్స్ లు ప్రమాద స్థలానికి చేరకున్నాయి. మంటలు ఒక బిల్డింగ్ నుంచి మరో బిల్డింగ్ కు వ్యాపిస్తుండటంతో.. చార్మినార్ వెళ్లే రహదారులను మూసివేశారు పోలీసులు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు తెలిపారు. భారీగా ఆస్తి నష్టం జరిగిందని చెప్పారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.