చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు..మల్కాజిగిరి సీపీ సుమతి వార్నింగ్

చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు..మల్కాజిగిరి సీపీ సుమతి వార్నింగ్
  •     బక్రీద్ నేపథ్యంలో స్పెషల్ మీటింగ్

మల్కాజిగిరి, వెలుగు: బక్రీద్ పండుగను ఎలాంటి గొడవలు లేకుండా, పరస్పర సహకారంతో ప్రశాంతంగా జరుపుకోవాలని మల్కాజిగిరి సీపీ బి. సుమతి సూచించారు. పండుగ ఏర్పాట్లు, భద్రతపై శనివారం నేరేడ్​మెట్​లోని సీపీ ఆఫీస్​లో మల్కాజిగిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డితో కలిసి ఆమె ప్రత్యేక సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం ప్రతినిధులు, గోరక్షక్ సభ్యులతో విడివిడిగా మాట్లాడారు. పండుగను సామరస్యంగా జరుపుకోవడమే సమాజ ఐక్యతకు ప్రతీక అని అన్నారు.

సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను, వదంతులను నమ్మవద్దని.. అనుమానాస్పద వాహనాలు లేదా అక్రమ రవాణా గమనిస్తే పోలీసులకు చెప్పాలి తప్ప చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోవద్దని హెచ్చరించారు. ముఖ్యంగా గోవులను తరలిస్తున్నారని వాహనాలను అడ్డుకోవడం, వ్యక్తులపై దాడులు చేయడం, బలవంతపు తనిఖీలు చేయడం వంటి పనులకు పాల్పడరాదని గోరక్షక్ సభ్యులకు స్పష్టం చేశారు.

ప్రభుత్వం అనుమతించిన చోటే జంతువధ చేయాలని, రోడ్లపై వ్యర్థాలు వేయకుండా మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని ముస్లింలకు సూచించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాల నిఘా ఉంటుందని భద్రతా ఏర్పాట్లను వివరించారు. ఈ మీటింగ్​లో ఎల్బీనగర్ డీసీపీ అనురాధ, మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్, ఉప్పల్ డీసీపీ సురేశ్ సహా పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.