మోదీ ప్రసంగంలో మా ప్రశ్నలకు జవాబేది..! స్పీచ్ మొత్తం అబద్ధాలే: కాంగ్రెస్ చీఫ్ ఖర్గే

మోదీ ప్రసంగంలో మా ప్రశ్నలకు జవాబేది..! స్పీచ్ మొత్తం అబద్ధాలే: కాంగ్రెస్ చీఫ్ ఖర్గే

న్యూఢిల్లీ: తాము సంధించిన ప్రశ్నలకు జవాబు చెప్పే ధైర్యం ప్రధాని మోదీకి లేదని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. ‘‘రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా మేం లేవనెత్తిన ఒక్క ప్రశ్నకు కూడా మోదీ జవాబు చెప్పలేదు. ఆయన రాజ్యసభలో మాట్లాడిన 97 నిమిషాల పాటు అన్నీ అబద్ధాలే చెప్పారు. 100 ఏండ్లు.. 75 ఏండ్లు.. 50 ఏండ్లు.. అంటూ పాత ముచ్చట్లే చెప్పుకుంటూపోయారు” అని విమర్శించారు. శుక్రవారం ఢిల్లీలో మీడియాతో ఖర్గే మాట్లాడారు. ఆర్మీ మాజీ చీఫ్ నరవణె రాసిన పుస్తకంపై రాహుల్ పార్లమెంట్‌‌లో ప్రస్తావిస్తే అధికార పక్షం ఎందుకు ఉలిక్కిపడుతోందని ఆయన ప్రశ్నించారు. 

ఆ పుస్తకం పబ్లిష్ కాలేదని అమిత్ షా, రాజ్‌‌నాథ్ సింగ్‌‌ అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. నిజానికి ఆ బుక్ విదేశాల్లో పబ్లిష్ అయిందని స్పష్టం చేశారు. ‘‘మేం సిక్కులను అవమానించామని మోదీ అంటున్నారు. ఇద్దరు వ్యక్తులు పార్లమెంట్ బయట మాట్లాడుకున్న మాటలను ప్రస్తావిస్తూ.. సిక్కులకు జరిగిన అవమానంగా చిత్రీకరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సిక్కులంటే ఎంతో గౌరవం. మా హయాంలోనే మన్మోహన్ సింగ్ ప్రధానిగా పని చేశారు. 

కానీ మోదీకి సిక్కులన్నా, దళితులన్నా, ఆదివాసులన్నా గౌరవం లేదు” అని ఫైర్ అయ్యారు.  ‘‘ఎప్‌‌స్టీన్ ఫైల్స్‌‌లో తన ప్రస్తావన వచ్చినప్పటి నుంచి మోదీ ఇబ్బంది పడుతున్నారు. అందుకే ట్రంప్ ముందు లొంగిపోయి వాణిజ్య ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందం వల్ల అమెరికా రైతులు ధనికులవుతారు.. మన రైతులు పేదలుగా మారుతారు” అని ఆవేదన వ్యక్తం చేశారు. నెహ్రూ పబ్లిక్ సెక్టార్ కంపెనీలను బలోపేతం చేస్తే, మోదీ వాటిని నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు.