ప్రాణం తీసిన జీపీఎస్.. అమెరికాలోని నార్త్‌‌ కరోలినాలో ఘటన

ప్రాణం తీసిన జీపీఎస్.. అమెరికాలోని నార్త్‌‌ కరోలినాలో ఘటన

న్యూఢిల్లీ: అమెరికాలోని నార్త్‌‌ కరోలినాకు చెందిన ఓ వ్యక్తి జీపీఎస్‌‌ను ఫాలో అవుతూ తన కారును నదిలోకి తీసుకెళ్లాడు. సెప్టెంబర్‌‌‌‌ 30న నార్త్‌‌ కరోలినాలోని హికోరి సిటీలో ఈ ప్రమాదం జరిగింది. ఫిల్‌‌ పాక్సన్‌‌ (47) తన కుమార్తె 9వ పుట్టిన రోజు ఫంక్షన్‌‌ జరుపుకొని రాత్రి కారులో ఇంటికి వెళ్తున్నాడు. రూట్‌‌ కోసం జీపీఎస్‌‌ను పెట్టుకొని ఇంటి బాట పట్టాడు. అయితే, నావిగేషన్‌‌ సిస్టమ్‌‌ అతన్ని ఏండ్ల క్రితం ధ్వంసం అయిన బ్రిడ్జి మీదకు దారి చూపించింది. అది గమనించని ఆ వ్యక్తి వెళ్లి కారుతో సహా నదిలో పడిపోయాడు.

ఈ విషయాన్ని పాక్సన్‌‌ అత్త లిండా మెక్‌‌ఫీ కోయినిక్‌‌ తన ఫేస్‌‌బుక్‌‌ పోస్ట్‌‌లో వివరించారు. తొమ్మిదేండ్ల క్రితం ధ్వంసం అయిన బ్రిడ్జికి ఇప్పటిదాకా రిపేర్లు జరగలేదన్నారు. అక్కడ బ్రిడ్జి ఉన్న విషయం తెలియక తన అల్లుడు నావిగేషన్‌‌ సిస్టంను అనుసరించి వెళ్లి నదిలో పడి, చనిపోయాడని తెలిపారు. ఆ బ్రిడ్జి వద్ద ఎలాంటి హెచ్చరిక బోర్డులు కూడా లేకపోవడం ప్రమాదానికి కారణమన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, డెడ్‌‌బాడీని రికవరీ చేసకున్నారు.