- తాగిన మత్తులో స్పృహ తప్పి పడిపోయిన వ్యక్తి
- మూకుమ్మడిగా దాడి చేసిన వీధి కుక్కలు
- కాలు, ముఖం, చెయ్యిని కొరికేస్తుండగా గమనించిన స్థానికులు
- కుక్కలను తరిమేసి చూడగా.. అప్పటికే వ్యక్తి మృతి
- మృతుడు సిద్దిపేట జిల్లా రామవరం గ్రామస్తుడిగా గుర్తింపు
కొడంగల్, వెలుగు: తాగిన మత్తులో స్పృహతప్పి పడివున్న ఓ వ్యక్తిపై వీధి కుక్కలు దాడి చేసి పీక్కుతిన్నాయి. ఈ ఘోరమైన ఘటన వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణ శివారులో వెలుగుచూసింది. కొడంగల్ పట్టణ శివారులోని ఎస్సార్ పెట్రోల్ బంక్ సమీపంలో శనివారం అటుగా వెళ్తున్న కొందరు స్థానికులకు వీధి కుక్కల గుంపు ఒక వ్యక్తిని చుట్టుముట్టి పీక్కుతింటుండటాన్ని గమనించారు.
కుక్కలను అక్కడి నుంచి తరిమి చూడగా.. అప్పటికే ఆ వ్యక్తి మృతిచెంది ఉన్నాడు. అతడి కాలు, చేయి, ముఖంతో పాటు ఇతర శరీర అవయవాలను కుక్కలు పీక్కు తిన్నట్టు వారు గుర్తించారు. వారిచ్చిన సమాచారం మేరకు కొడంగల్ ఎస్ఐ సత్యనారాయణ తన సిబ్బందితో కలిసి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గుర్తుపట్టలేనంతగా మారిన ఆ డెడ్‌బాడీకి పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
చిక్బల్లాపూర్ వెళ్తానని చెప్పి..
మృతుడి వద్ద ఉన్న ఆధారాలను బట్టి ఆచూకీ కోసం గాలించగా, పోలీసులకు కుటుంబ సభ్యుల వివరాలు లభించాయి. మృతుడిని సిద్దిపేట జిల్లా రామవరం గ్రామానికి చెందిన బ్రహ్మచారి (32)గా గుర్తించారు. బ్రహ్మచారికి దైవభక్తి ఎక్కువ కావడంతో గ్రామంలోని ఓ గుడిలోనే పూజారిగా జీవితం గడుపుతున్నాడు. తరచూ దేశంలోని పలు పుణ్యక్షేత్రాలకు వెళ్లిరావడం అతనికి అలవాటు. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం కర్నాటకలోని ప్రముఖ క్షేత్రం చిక్బల్లాపూర్కు వెళ్తున్నానని ఇంట్లో వాళ్లకు చెప్పి బయలుదేరాడు.
మద్యం మత్తే ప్రాణం తీసింది!
ప్రయాణం మధ్యలో శుక్రవారం సాయంత్రం కొడంగల్‌కు చేరుకున్న బ్రహ్మచారి.. అక్కడ విపరీతంగా మద్యం తాగాడు. ఆ తర్వాత మత్తు దిగకపోవడంతో పెట్రోల్ బంక్ సమీపంలోనే స్పృహతప్పి పడిపోయాడు. అర్ధరాత్రి ఆ ప్రాంతంలో తిరుగుతున్న వీధి కుక్కల గుంపు ఒంటరిగా పడివున్న బ్రహ్మచారిపై దాడి చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మద్యం మత్తులో శరీరం సహకరించకపోవడం, కేకలు వేసే ఓపిక కూడా లేకపోవడంతో కుక్కలు విచక్షణారహితంగా దాడి చేసి చంపేసినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న మృతుడి అన్న రమేశ్ కొడంగల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు.
