సీఎంవో ఉద్యోగినంటూ వసూళ్లు…

సీఎంవో ఉద్యోగినంటూ వసూళ్లు…

అడిగినంత ధనం ఇవ్వకుంటే జాబ్ పోతదని బెదిరింపులు

‘జస్ట్ డయల్’ నుంచి  నంబర్ల సేకరణ

సబ్ రిజిస్ట్రార్లు, రెవెన్యూ అధికారులే టార్గెట్

రెండు నెలల్లో లక్షా 85 వేల ‘కలెక్షన్’

ముఖ్యమంత్రి ఆఫీసు ఉద్యోగినని చెబుతూ వసూళ్లకు పాల్పడుతున్న ఘరానా మోసగాడి ఆటకట్టించారు పోలీసులు. జర్నలిస్టులు, అమరవీరుల దినోత్సవాల పేరుతో వసూళ్లు చేస్తున్న రాయబండి సూర్యప్రకాశ్ చారి అలియాస్ సూరిబాబు(40)ని సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. అతడి నుంచి రూ.10 వేల నగదు రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసున్నారు. ఐదేళ్లలో 11 కేసుల్లో నిందితుడిగా ఉన్న చారి వివరాలను టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్​రావు వెల్లడించారు.

‘సీఎంవో నుంచి మాట్లాడుతున్నా..’

రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం కుంట్లూరుకు చెందిన చారి.. ఉప్పల్​లోని కల్యాణపురి కాలనీలో ఉంటున్నాడు. విందులు, విలాసాలకు అలవాటు పడిన అతడు.. 2009 నుంచి తెలంగాణ అమవీరుల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నాడు. సబ్ రిజిస్ట్రార్లు, రెవెన్యూ, ఎలక్ట్రిసిటీ, జీహెచ్ఎంసీ సహా కీలక డిపార్ట్ మెంట్ల ఉద్యోగులను, ప్రైవేట్ కంపెనీలను టార్గెట్ చేసుకున్నాడు. తాను చీఫ్ మినిస్టర్ ఆఫీస్ ఉద్యోగినని చెప్పుకుంటూ బెదిరింపులు పాల్పడుతున్నాడు. జస్ట్ డయల్ నుంచి జిల్లాల వారీగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల ల్యాండ్ లైన్ నంబర్లు సేకరించాడు. వాటికి కాల్ చేసి, సబ్ రిజిస్ట్రార్ మొబైల్ నంబర్ తెలుసుకునేవాడు. తర్వాత సదరు అధికారులకు ఫోన్ చేసి.. తాము నిర్వహించే కార్యక్రమాల ఖర్చుల కోసం కొంత డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేసేవాడు. అలాగే సచివాలయ జర్నలిస్టులకు తాము వివిధ రకాల సౌకర్యాలు కల్పించాలని చెప్పేవాడు. తన మాట వినకపోతే సీఎంఓ ఆఫీస్ కి వచ్చిన ఫిర్యాదులతో మీ ఉద్యోగం పోతుందని బెదిరించేవాడు. అతడి బెదిరింపులకు భయపడ్డ ఓ సబ్ రిజిస్ట్రార్ నెలనెల మామూళ్లు ఇస్తూ వస్తున్నారు.

ఇలా దొరికాడు

గత నెల సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లోని సబ్ రిజిస్ట్రార్లు, ఇన్ చార్జ్ సబ్ రిజిస్ట్రార్లకు కాల్ చేశాడు. ‘తెలంగాణ పోరాట యోధుల’ పేరుతో నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో సిద్దిపేట సబ్ రిజిస్ట్రార్.. చారి అకౌంట్​లోకి రూ.లక్ష ట్రాన్స్ ఫర్ చేశారు. ఇన్​చార్జ్ సబ్ రిజిస్ట్రార్ రూ.55 వేలు డిపాజిట్ చేశారు. సంగారెడ్డి జిల్లా సబ్ రిజిస్ట్రార్ నుంచి రూ.30 వేలు వసూలు చేశాడు. ఇలా జూన్, జులై నెలల్లో ముగ్గురి వద్ద రూ.1.85 లక్షలు వసూలు చేశాడు. చారి వైఖరిపై అనుమానం వచ్చిన సదరు సబ్ రిజిస్ట్రార్లు సచివాలయంలో తమకు తెలిసిన ఉద్యోగులతో ఆరా తీశారు. అలాంటి పేరుతో ఎవరూ లేరని తేలడంతో సిద్దిపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారమివ్వగా.. సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు చారి కోసం గాలించారు. బ్యాంక్ అకౌంట్స్, కాల్ డేటా ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. హైదరాబాద్​లోని పలు పోలీస్​స్టేషన్లలో అతడిపై కేసులు నమోదైనట్లు గుర్తించారు.