సీఎం సభలో స్టేజ్​పైకి బిడ్డను విసిరేసిండు

సీఎం సభలో స్టేజ్​పైకి బిడ్డను విసిరేసిండు

సాగర్: మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఓ పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడుతుండగా.. ఓ వ్యక్తి తన ఏడాది కొడుకును తీసుకొచ్చి స్టేజీ మీదకు విసిరేశాడు. ముందుగా పోలీసులు, అధికారులు, జనం అతనిపై చాలా సీరియస్ అయ్యారు. కానీ అతని గోడు తెలుసుకున్న తర్వాత మాత్రం అందరూ ‘అయ్యో పాపం’ అన్నారు. మధ్యప్రదేశ్ లోని సాగర్ జిల్లా, సహజ్ పూర్ గ్రామానికి చెందిన ముకేశ్ పటేల్, అతని భార్య కూలీలుగా పని చేస్తుంటారు. వారికి ఏడాది కిందట కొడుకు పుట్టాడు. కానీ మూడు నెలలకే అనారోగ్యానికి గురికావడంతో డాక్టర్లు టెస్ట్ చేసి గుండెలో రంధ్రం ఉందని గుర్తించారు. అప్పు సప్పు చేసి పెద్దమొత్తంలో ఖర్చు చేసినా బిడ్డ ఆరోగ్యం కుదుటపడలేదు. రంధ్రం పూడ్చేందుకు ఆపరేషన్ చేయాలని, అందుకోసం రూ. 3.50 లక్షలు ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పారు. ఇప్పటికే రూ. 4 లక్షల వరకూ ఖర్చు చేసిన తనకు మరో రూ. 3.50 లక్షలు ఖర్చు చేసే తాహతు లేకపోవడంతో సీఎంను కలిసి సాయం పొందాలని ప్రయత్నించాడు. కానీ సీఎంను కలిసేందుకు పోలీసులు అతడిని అనుమతించలేదు.

దీంతో ఎలాగైనా తన కష్టం సీఎం దృష్టిలో పడాలని భావించిన అతను ఆదివారం సాగర్ లో సీఎం మీటింగ్ జరుగుతుండగా స్టేజీ మీదకు బిడ్డను విసిరేశాడు. ఒక్కసారిగా కలకలం రేగడంతో బిడ్డను విసిరేయడాన్ని చూసిన సీఎం.. ఏం జరిగిందని ఆరా తీశారు. బిడ్డకు గుండెలో రంధ్రం ఉందని, ఆపరేషన్ కు డబ్బులు లేవని తెలుసుకున్నారు. ప్రభుత్వం తరఫున సాయంచేస్తామని ప్రకటించారు. సీఎం తనకు సాయం చేస్తానని చెప్పారని, అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారని ముకేశ్ చెప్పాడు.