డిసెంబర్ లో భారీగా సైబర్ మోసాలు.. 58 మంది నేరగాళ్లు అరెస్ట్

డిసెంబర్ లో భారీగా సైబర్ మోసాలు.. 58 మంది నేరగాళ్లు అరెస్ట్
  • బాధితులకు రూ.2 కోట్లకు పైగా రిఫండ్

బషీర్​బాగ్, వెలుగు: గత డిసెంబర్ నెలలో నగరంలో సైబర్ నేరాలు భారీగా జరిగారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు ప్రకటన విడుదల చేశారు. సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ లో నేషనల్ సైబర్ క్రైం రిపోర్టింగ్ పోర్టల్ కు 266 ఫిర్యాదులు రాగా.. 144 ఎఫ్ఐఆర్ లు నమోదు చేశామన్నారు. వీటిలో 34 కేసుల్లో ప్రమేయం ఉన్న 15 రాష్ట్రాలకు చెందిన 43 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఆయా కేసుల్లో 19 ఇన్వెస్ట్​మెంట్ ఫ్రాడ్, 8 డిజిటల్ అరెస్ట్, 3 సోషల్ మీడియా  ఫ్రాడ్, బిజినెస్, కస్టమర్ కేర్ ఫ్రాడ్, హ్యాకింగ్, ప్రైవసీ కేసులు ఒక్కొక్కటి ఉన్నాయని పేర్కొన్నారు. 

బాధితులకు మొత్తం రూ.1.33 కోట్లు రిఫండ్ చేశామన్నారు. జోనల్ సైబర్ సెల్ లో 2,195 ఫిర్యాదులు రాగా.. 80 ఎఫ్ఐఆర్ లు నమోదు చేశామని తెలిపారు. సైబర్ సెల్ ఫిర్యాదులలో దేశవ్యాప్తంగా 13 కేసుల్లో ప్రమేయం ఉన్న 15 మంది సైబర్ నేరగాళ్లకు అరెస్ట్ చేసి, బాధితులకు మొత్తం రూ.72.36 లక్షలు రిఫండ్ చేశామని పేర్కొన్నారు. అరెస్టయిన వారిలో ఒక సైబర్ చీటర్ పై దేశవ్యాప్తంగా 119 కేసులున్నాయని, రూ.73 కోట్ల వరకు మోసాలకు పాల్పడినట్లు గుర్తించామని తెలిపారు.