శాంతి చర్చలకు మోడీ సర్కార్ అనుకూలమా లేదా..? మావోయిస్టు పార్టీ మరో లేఖ విడుదల

శాంతి చర్చలకు మోడీ సర్కార్ అనుకూలమా లేదా..? మావోయిస్టు పార్టీ మరో లేఖ విడుదల

హైదరాబాద్: 2026 మార్చి నాటికి నక్సల్ రహిత దేశమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ చేపట్టింది. ఇందులో భాగంగానే మావోయిస్టుల కంచుకోటలను బద్దలు కొడుతూ కేంద్ర సాయుధ దళాలు ముందుకు సాగుతున్నాయి. ఆపరేషన్ కగార్ లో భాగంగా ఇప్పటికే వందల సంఖ్యలో మావోయిస్టులు మరణించారు. ఈ క్రమంలో చర్చల ద్వారా శాంతి నెలకొల్పాలని కోరుతూ మావోయిస్టు పార్టీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. 

ఈ మేరకు లేఖ విడుదల చేసింది. అయితే.. మావోయిస్టుల శాంతి చర్చల అభ్యర్థనను ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో చర్చల ద్వారా శాంతి నెలకొల్పాలని కోరుతూ తాజాగా మరో లేఖ విడుదలు చేశారు మావోయిస్టులు. బుధవారం (మే 14) భారత కమ్యూనిస్ట్ పార్టీ (మావోయిస్ట్) కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్  పేరుతో లేఖ విడుదల చేశారు. శాంతియుత సంభాషణల ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించడానికి మా పార్టీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని.. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దీనికి అనుకూలంగా ఉందో లేదో స్పష్టం చేయాలని కోరింది.

 ప్రజా సమస్యలను పరిష్కరించడానికి, ఆపరేషన్ కగార్‌ను ఆపడానికి ముందుకు రావాలని విజ్ఞప్తి  చేసింది. శాంతి చర్చలు జరపడానికి ప్రభుత్వాన్ని ఒప్పించడానికి  ముందుకు రావాలని పౌర హక్కుల ప్రజాస్వామ్యవాదులకు పిలుపునిచ్చింది మావోయిస్టు పార్టీ. శాంతి చర్చల కోసం మావోయిస్టులు చేసిన అభ్యర్థనను ప్రభుత్వం ఈ సారైనా పరిగణలోకి తీసుకుని శాంతి చర్చలకు ఆహ్వానిస్తోందో లేదో చూడాలి.