టీఆర్ఎస్ నేత నల్లూరి శ్రీనివాస్ హత్యతో భద్రాద్రి ఏజెన్సీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. శ్రీనివాస్ హత్యతో మావోయిస్ట్ లు, పోలీస్ లకు సవాల్ విసిరారు. దీంతో ఏజెన్సీ ప్రాంతంలోని అధికార పార్టీ నేతల్లో వణుకు మొదలైంది. ఒకప్పుడు నక్సలిజానికి అడ్డాగా ఉన్న తెలంగాణ గడ్డపై, మళ్లీ విస్తరించేందుకు యాక్షన్ ప్లాన్ మొదలు పెట్టారు మావోలు. వీరికి అడ్డుకట్ట వేసేందుకు రంగంలోకి దిగారు తెలంగాణ పోలీసులు.
చర్ల మండలం కోత్తూరు గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నేత నల్లూరి శ్రీనివాస్ ను మావోయిస్ట్ లు హత్య చేయడంతో ఒక్కసారిగా ఏజెన్సీ లో మళ్లీ ఉద్రిక్తపరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నెల 8వ తేదీ అర్థరాత్రి శ్రీనివాస్ ను చర్ల శబరి ఏరియా కమిటీ మావోయిస్ట్ లు కిడ్నాప్ చేశారు. నాలుగు రోజుల పాటు తమ బందీగా ఉంచుకుని హత్య చేసి, చత్తీస్ ఘడ్ సుక్మా జిల్లా ఎర్రంపాడు పుట్టాడు మధ్య రోడ్డు పక్కన పడేశారు.
ఒకప్పుడు నక్సలిజానికి అడ్డాగా ఉన్న తెలంగాణ గడ్డపై మళ్లీ విస్తరించడానికి మావోయిస్ట్ పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో చత్తీస్ ఘడ్ లో మావో ల కంచుకోటైన అబూజ్ మడ్ నలుదిక్కులా భద్రతా బలగాలు మొహరించాయి. టీఆర్ఎస్ నేత నల్లూరి శ్రీనివాస్ హత్యతో పోలీస్ లకు సవాల్ విసిరింది మావోయిస్టు పార్టీ శారదక్క దళం. ఈమె చర్ల శబరి ఏరియా కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్న తర్వాతే భద్రాద్రి ఏజెన్సీలో మళ్లీ అలజడి మొదలైంది. దీంతో శ్రీనివాస్ హత్యతో అధికార పార్టీ నేతలు గ్రామాలు ఖాళీ చేసే పరిస్థితి నెలకొంది.
భద్రాద్రి ఏజెన్సీతో పాటు, భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల ఏజెన్సీ గ్రామాల్లో టీఆర్ఎస్ నేతలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

