V6 News

మార్కెట్లకు క్రూడ్ ధరల దెబ్బ..ఐటీ స్టాక్స్ కు భారీ నష్టాలు..సెన్సెక్స్ 756 పాయింట్లు డౌన్

మార్కెట్లకు క్రూడ్ ధరల దెబ్బ..ఐటీ స్టాక్స్ కు భారీ నష్టాలు..సెన్సెక్స్ 756 పాయింట్లు డౌన్
  • సెన్సెక్స్ 756 పాయింట్లు డౌన్ 
  • 198 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
  • మార్కెట్లకు క్రూడ్ ​ధరల దెబ్బ
  • ఐటీ స్టాక్స్​కు భారీ నష్టాలు
  • 94 స్థాయికి చేరుకున్న రూపాయి

ముంబై: స్టాక్​మార్కెట్లలో గత మూడు రోజులుగా కొనసాగుతున్న లాభాల పరంపరకు బ్రేక్ పడింది. ఐటీ షేర్లలో భారీ అమ్మకాలు, ముడి చమురు ధరల పెరుగుదల కారణంగా కీలక సూచీలు బుధవారం నష్టాల్లో ముగిశాయి.  ఐటీ కంపెనీ హెచ్​సీఎల్ టెక్ నిరాశాజనక ఫలితాలు వెల్లడించడం ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీసింది. పశ్చిమ ఆసియాలో నెలకొన్న అనిశ్చితి, విదేశీ నిధుల తరలింపు మార్కెట్లను దెబ్బతీశాయి.  సెన్సెక్స్ 756.84 పాయింట్లు నష్టపోయి 78,516.49 వద్ద ముగిసింది. 

ట్రేడింగ్ సమయంలో ఒక దశలో 831 పాయింట్ల వరకు సెన్సెక్స్ పడిపోయింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ కూడా 198.50 పాయింట్ల నష్టంతో 24,378.10 వద్ద స్థిరపడింది. ఐటీ రంగ సూచీ అత్యధికంగా 3.66 శాతం పతనమైంది. హెచ్​సీఎల్ టెక్ సుమారు 11 శాతం మేర నష్టపోయి టాప్ లూజర్‌‌‌‌గా నిలిచింది. మార్చి క్వార్టర్ ఫలితాల్లో ఆ కంపెనీ లాభం రూ.4,488 కోట్లుగా నమోదైనప్పటికీ, భవిష్యత్ వృద్ధి అంచనాలు తక్కువగా ఉండటంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు. ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు కూడా నష్టపోయాయి. హిందుస్థాన్ యూనీలివర్, ఎన్​టీపీసీ షేర్లు లాభపడ్డాయి.

 పెరిగిన చమురు ధరలు

అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం భారత మార్కెట్లపై ప్రభావం చూపింది. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌‌‌‌కు 99.72 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. హోర్మూజ్ జలసంధి మూసివేత, అమెరికా–-ఇరాన్ మధ్య చర్చల్లో అనిశ్చితి కారణంగా ఇంధన ధరలు భారంగా మారాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు మంగళవారం రూ.1,918 కోట్లు విలువైన షేర్లను అమ్మారు. ఆసియా మార్కెట్లలో జపాన్ నిక్కీ, షాంఘై సూచీలు లాభపడగా, హాంకాంగ్ హ్యాంగ్ సెంగ్ నష్టాల్లో ముగిసింది.   

రూపాయి విలువ వరుసగా మూడో రోజు క్షీణించింది. బుధవారం 39 పైసలు తగ్గి రూ.93.83 వద్ద స్థిరపడింది. ముడి చమురు ధరలు మండుతుండటం, దేశీయ మార్కెట్ల నుంచి విదేశీ మూలధనం బయటకు వెళ్లడం రూపాయిపై ఒత్తిడి పెంచింది. ఇరాన్‌‌‌‌పై బాంబు దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించడం పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలను మరింత పెంచింది.  ఇవి రూపాయి విలువను రూ.94 స్థాయికి తగ్గించాయి.